Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
స్వగ్రామం నారావారి పల్లెలో సంక్రాంతి పండుగ జరుపుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. హిందూపురం ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ కుటుంబసభ్యులు కూడా వారి వెంట ఉన్నారు. అందరిలోకి ముఖ్యమంత్రి మనవడు నారా దేవాన్ష్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచాడు . ఓ వైపు ఇద్దరు తాతలు, మరోవైపు తల్లిదండ్రులు నడిచి వస్తుండగా… చిన్న పట్టు పంచె, లాల్చీ, భుజనా కండువా వేసుకుని వారు ముందు దేవాన్ష్ నడిచి వెళ్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. కాసేపు లోకేష్ కొడుకును ఎత్తుకోగా, మరికాసేపు దేవాన్ష్ పంచె జాగ్రత్తగా పట్టుకుని నడుచుకుంటూ వెళ్లాడు.
ఆలయంలో డాలర్ శేషాద్రి కాసేపు దేవాన్ష్ చేయిపట్టుకుని నడిపించాడు. బయటకు వచ్చిన తరువాత మహాద్వారం వద్ద మీడియా ఫొటోలు తీసుకుంటోంటే జారిపోతున్న పంచెను సర్దుకుంటూ కనిపించాడు దేవాన్ష్ . దర్శనానంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో… సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్టు చెప్పారు. అతిత్వరలోనే తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిని మార్చనున్నట్టు కీలక ప్రకటన చేశారు. ఇతర మతాలపై విశ్వాసం ఉన్నవారిని నియమిస్తున్నట్టు వచ్చిన వార్తలను ఖండిచింన ఆయన, హిందూ ధర్మం ప్రకారమే ఏ నిర్ణయమైనా తీసుకుంటామని తెలిపారు.