Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
క్రమశిక్షణకు మారుపేరైన టీడీపీలో నేతలు కట్టుతప్పడాన్ని చంద్రబాబు సీరియస్ గా తీసుకుంటున్నారు. చిన్నస్థాయి నేతల్ని చూసీచూడనట్లు వదిలేయడం కారణంగా.. ఏకంగా మంత్రులే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని తేలింది. దీంతో పార్టీ సమన్వయ కమిటీ భేటీలో బాబు గంటా, అయ్యన్నకు క్లాస్ పీకినట్లు ఇన్ సైడ్ టాక్. అందుకే కమిటీ భేటీ ముగియగానే అయ్యన్న రివర్స్ గేర్ వేసి.. గంటాతో విభేదాల్లేవని తేల్చిచెప్పారు.
దీన్ని బట్టి చంద్రబాబు తలుచుకుంటే ఏ నేత అయినా దిగిరావాల్సిందేననే మాట మరోసారి నిజమైంది. పాలనా వ్యవహారాల్లో బిజీగా ఉన్న చంద్రబాబు కొంతకాలంగా పార్టీని పట్టించుకునే తీరిక దొరకడం లేదు. దీంతో నేతలు రెచ్చిపోతున్నారు. ఇన్నాళ్లూ సహించిన చంద్రబాబు.. పాత చంద్రబాబును చూస్తారని గతంలోనే హెచ్చరించారు. ఆ స్టేట్ మెంట్ వచ్చిన దగ్గర్నుంచి నేతలు కాస్త తగ్గి ఉంటున్నారు.
ఇప్పుడు త్రిసభ్య కమిటీ వేసిన చంద్రబాబు ఎక్స్ ట్రాలు చేస్తే తోకలు కట్ చేసే విధంగా పార్టీ నియమావళికి మార్పులు తెచ్చే ఉద్దేశంలో ఉన్నారు. దీంతో జిల్లాల్లో గ్రూపులు కడుతున్న నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా పనిచేసిన స్ట్రిక్ట్ చంద్రబాబును గుర్తుకుతెచ్చుకుంటున్న వాళ్లకు కంటి మీద కునుకు కరవైంది. కామెడీ టైమ్ అయిపోయిందని ఇక నేతలకు మూడినట్లేనని కార్యకర్తలు కూడా సంతోషిస్తున్నారు.