టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రాజకీయాలలో ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. అయితే ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఆయన అసెంబ్లీ వద్ద ప్రత్యక్షమయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అయితే వైసీపీ పాలనపై చంద్రబాబుతో మాట్లాడిన జేసీ బాబుగారికి కొన్ని సూచనలు సలహాలు ఇచ్చినట్టు సమాచారం.
అయితే వైసీపీ వాళ్ళు తప్పులు చేస్తుంటే మీరెందుకు ఆపుతున్నారని, వాళ్ళ తప్పులు చూసే ప్రజలకు ఎవరు ఏంటో తెలియాలని అన్నారు. వైసీపీ ఎన్ని తప్పులు చేస్తే మనకు అంత మంచిదని, ఒక్క ఛాన్స్ ఇచ్చిన జనాలకు ఇప్పటికే వైసీపీ పాలనపై అసంతృప్తి ఏర్పడిందని అన్నారు. అయితే వైసీపీ తప్పులను మీరు మాత్రం ఎత్తిచూపకండని చంద్రబాబుకు జేసీ చెప్పగా చంద్రబాబు బదులిస్తూ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే రాజకీయాల కోసం మనం చూస్తూ ఉండలేం కదా అని వ్యాఖ్యానించారు. అయితే 23 సీట్లు ఇచ్చిన మనకంటే, 151 సీట్లు ఇచ్చిన వారిపైనే ప్రజల బాగోగుల్ని చూసుకునే బాధ్యత ఉంటుందని అందులో వారు ఇప్పటికే సగం విఫలమయ్యారని జేసీ అన్నారు.