ఐవైఆర్ మీద వేటేసిన బాబు.

brahmana corporation chairman iyr krishna rao

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు మీద టీడీపీ సర్కార్ వేటేసింది. ఈ పరిస్థితి అనూహ్యం అనిపించినా ఇది కృష్ణారావు స్వయంకృతమే అని చెప్పుకోవాలి. ఎందరో సీఎస్ లు సర్కార్ కోసం పనిచేస్తుంటారు. కానీ పదవీ విరమణ టైం లో ఓ పుష్పగుచ్ఛము, నాలుగు మంచి మాటలు చెప్పి పంపిస్తుంది ఏ ప్రభుత్వం అయినా. కానీ చంద్రబాబు సర్కార్ మాత్రం అందుకు భిన్నంగా ఐవైఆర్ కృష్ణారావుని గౌరవించింది. బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ఛైర్మన్ గా నియమించింది. పార్టీ కోసం నానాకష్టాలు పడి జీవితాంతం కృషి చేసినా క్యాబినెట్ రాంక్ రాదు. అలాంటిది ఏ కష్టం లేకుండా పదవీ విరమణ చేయగానే క్యాబినెట్ ర్యాంక్ రావడంతో ఐవైఆర్ కి దాని విలువ తెలియలేదు.

పేదరికంలో వున్న అగ్రవర్ణాలకు ఊతం ఇచ్చేందుకు బాబు సర్కార్ కులాలవారీగా కార్పొరేషన్స్ ఏర్పాటు చేసింది. బ్రాహ్మణ కార్పొరేషన్ కి భారీగా నిధులు కూడా ఇచ్చింది. ఒక వైపు ఆ పనులు చూస్తూనే సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు సర్కార్ మీద వస్తున్న విమర్శల్ని ఐవైఆర్ షేర్ చేయగలరని ఏ ఒక్కరూ ఊహించలేదు. ఏదో పొరపాటు జరిగి ఉంటుందనో, ఇంకెవరైనా కావాలని చేసారనో భావించారు. కానీ ఒకటిరెండు కాదు… ఎన్నో సందర్భాల్లో ఐవైఆర్ అదే ధోరణి  అవలంభించిన విషయం ఇప్పుడు బయటికి వచ్చింది. చంద్రబాబుకి కుల పిచ్చి అంటూ కొందరు వైసీపీ నేతలు చేసిన పోస్టింగ్ ని ఐవైఆర్ షేర్ చేయడమే కాదు… దానిపై ప్రశ్నించిన పార్టీ నేతలకు దురుసుగా సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. అప్పటి దాకా సంయమనంతో వున్న పార్టీ శ్రేణులు ఈ వ్యవహారం గురించి అధిష్టానం దగ్గరికి తీసుకెళ్లారు. సీఎం చంద్రబాబు, లోకేష్ సైతం ఐవైఆర్ వైఖరి తెలుసుకుని షాక్ అయ్యారు. ఆయన వివరణ కోరదామని ముందుగా భావించినా పార్టీ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కృష్ణారావుని బ్రాహ్మణ కార్పొరేషన్ పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.