సెంటిమెంట్ ను చూసి రాష్ట్రాన్ని ఇచ్చిన‌ట్టు డ‌బ్బులు ఇవ్వ‌లేరా..?

Chandrababu gives Suggestions to AP Mps

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
రాష్ట్రానికి న్యాయం జ‌రిగే వ‌ర‌కూ పోరాటం కొన‌సాగించాల‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఎంపీల‌కు స్ప‌ష్టంచేశారు. ఎంపీలు, అసెంబ్లీ వ్యూహ‌క‌మిటీ ప్ర‌తినిధుల‌తో టెలీకాన్ఫ‌రెన్స్ నిర్వహించిన చంద్ర‌బాబు ఎంపీల‌కు దిశానిర్దేశం చేశారు. టీడీపీ ఎంపీలు క‌లిసిక‌ట్టుగా ఉండి చిత్త‌శుద్ధితో పోరాటం చేయాల‌ని సూచించారు. ఇది కీల‌క‌స‌మ‌య‌మ‌ని… స‌భ‌కు ఎవ‌రూ గైర్హాజ‌రు కావొద్ద‌ని కోరారు. స‌భ నుంచి స‌స్పెండ్ చేస్తే బ‌య‌ట నుంచి పోరాటం ఉధృతం చేయాల‌ని, ప్ర‌జ‌ల మ‌నోభావాల‌కు అనుగుణంగా టీడీపీ ఎంపీల పోరాటం ఉండాల‌ని, ఇత‌ర పార్టీల ఎంపీల‌ను కూడా స‌మ‌న్వ‌యం చేసుకుని ముందుకుసాగాల‌ని స‌ల‌హా ఇచ్చారు. నాలుగేళ్ల క్రితం సెంటిమెంట్ కు ప్ర‌త్యేక రాష్ట్ర‌మే ఇచ్చిన‌ప్పుడు… ఇప్పుడు సెంటిమెంట్ ను చూసి డ‌బ్బులు ఇవ్వ‌లేరా అని ముఖ్య‌మంత్రి కేంద్రాన్ని నిల‌దీశారు. ఒక ప్రాంత సెంటిమెంట్ ను చూపి, మ‌రో ప్రాంత ప్ర‌జ‌ల‌ను న‌డిరోడ్డుపైకి నెట్టిన‌ప్పుడు… ఇవాళ సెంటిమెంట్ ను ఎందుకు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిమాండ్లు హేతుబ‌ద్ధ‌మైన‌వ‌ని, విభ‌జ‌న చ‌ట్టం, పార్ల‌మెంట్ హామీలు అమ‌లుచేయాల‌న‌డం అహేతుకమా అని మండిప‌డ్డారు. రాష్ట్రానికి జ‌రిగిన అన్యాయం గురించి దేశం మొత్తానికి తెలియాల‌న్నారు. ఏ స‌భ సాక్షిగా… రాష్ట్రానికి అన్యాయం జ‌రిగిందో… అక్క‌డే న్యాయం జ‌ర‌గాల‌ని, ఏ పార్టీలైతే రాష్ట్రానికి అన్యాయం చేశాయో… అవే న్యాయం చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, ప్ర‌భుత్వం దిగివ‌చ్చేదాకా పోరాటం కొన‌సాగించాల‌ని చంద్ర‌బాబు ఎంపీలకు మార్గ‌ద‌ర్శ‌నం చేశారు. ఢిల్లీలో ఎంపీల పోరాటానికి సంఘీభావంగా రాష్ట్రంలో స్థానికంగా క్యాండిల్ ర్యాలీలు నిర్వ‌హించాల‌ని, అన్నిచోట్లా ఆందోళ‌న‌లు నిర్మాణాత్మకంగానే జ‌ర‌గాల‌ని సూచించారు. ప్ర‌తిప‌క్ష వైసీపీ వైఖ‌రిపై ముఖ్యమంత్రి ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. ప్ర‌జ‌లు వైసీపీని అస‌హ్యించుకునేరోజు ద‌గ్గ‌ర‌లోనే ఉంద‌న్నారు. ఒక‌వైపు విశ్వాసం ఉందంటూ… మ‌రోవైపు అవిశ్వాసం పెడ‌తామంటూ ద్వంద్వ‌వైఖ‌రి అవ‌లంబిస్తున్నార‌ని, ఎందుకీ డ్రామాలు, నాటకాల‌ని చంద్ర‌బాబు మండిప‌డ్డారు. ఆర్థిక నేర‌స్థులు ప్ర‌ధానిని క‌ల‌వ‌డం ఎక్క‌డైనా ఉందా అని విమ‌ర్శించిన ముఖ్య‌మంత్రి… పీఎంవో చుట్టూ ఏ2 నిందితుడి ప్ర‌ద‌క్షిణాలు ఏ సంకేతాలు పంపిస్తున్నాయ‌ని ప్ర‌శ్నించారు.