విభజన బాధిత ఏపీ పేదరాష్ట్రమయినప్పటికీ నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం దేశంలోనే అత్యంత సంపన్న సీఎంగా నిలిచారు. ఆయన ఆస్తుల మొత్తం విలువ సుమారు రూ.177 కోట్లని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీ ఫార్మ్స్ అనే సంస్థ వెల్లడించింది. ఈ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం…చంద్రబాబు తర్వాత రెండో సంపన్న సీఎంగా అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ నిలిచారు. ఆయన ఆస్తుల మొత్తం విలువ రూ.129 కోట్లు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రూ.48 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు. వీరు ముగ్గురూ పాన్ కార్డులు సమర్పించినట్టు తెలిపింది.
అత్యధిక ఆస్తులన్నవారి జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగో స్థానంలో నిలిచారు. ఆయనకు రూ. 15.51 కోట్ల ఆస్తులున్నట్టు నివేదిక తెలిపింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫామ్స్, నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థలు సంయుక్తంగా ముఖ్యమంత్రులు అసెంబ్లీ ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్లను విశ్లేషించి ఈ ఆస్తులును వెల్లడించాయి. అతితక్కువ ఆస్తులున్న సీఎంలలో త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ మొదటిస్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ కేవలం రూ. 26లక్షలు. రూ.30లక్షలతో మమతా బెనర్జీ, రూ. 50లక్షలతో మెహబూబా మెఫ్తీ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.