యూసీలు గురించి అడ‌గ‌డానికి అమిత్ షా ఎవ‌రు? చ‌ంద్ర‌బాబు ఆగ్ర‌హం

chandrababu naidu fires on amit shah

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

అమ‌రావతి నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధుల్లో ఒక్క‌రూపాయికి కూడా చంద్ర‌బాబు లెక్క‌చెప్ప‌లేద‌ని, న‌వ్యాంధ్ర రాజ‌ధాని ప‌టం ఇప్ప‌టికీ సింగ‌పూర్ దాటి బ‌య‌ట‌కు రాలేద‌ని బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా చేసిన ఆరోప‌ణ‌ల‌పై ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు. మ‌హానాడు వేదిక‌గా అమిత్ షా తీరును ఎండ‌గ‌ట్టారు. అమ‌రావ‌తిలో ప‌నులే ప్రారంభం కాలేద‌ని అమిత్ షా చెప్ప‌డం దారుణ‌మ‌ని మండిప‌డ్డారు. అమ‌రావ‌తి ప్ర‌ణాళిక‌లు ఇంకా సింగ‌పూర్ లోనే ఉన్నాయ‌ని చెప్ప‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌న్నారు. రాజ‌ధాని నిర్మాణానికి రూ. 2,500 కోట్లు ఇచ్చి మొత్తం ఇచ్చేసిన‌ట్టు బుకాయిస్తారా అని నిల‌దీశారు. పోల‌వ‌రం, అమ‌రావతి నిర్మాణాల‌కు నిధులివ్వ‌కుండా మొండికేసి ఇప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. యూసీలు పంపిస్తే నిజ‌మైన‌వి కాద‌ని ఆరోపిస్తున్నార‌ని మండిప‌డ్డ చంద్ర‌బాబు అయినా ఓ పార్టీ అధ్య‌క్షుడికి యూసీల విష‌యం ఎందుక‌ని నిల‌దీశారు. యూసీలు ఇచ్చామో లేదో..ప్ర‌ధాని మోడీ చెప్పాలి గానీ…అమిత్ షాకు ఎందుక‌ని మండిప‌డ్డారు. పాల‌నా అంశాల్లో జోక్యం చేసుకోవ‌డానికి ఆయ‌నెవ‌రని ప్ర‌శ్నించారు. సొంత పార్టీ వ్య‌వ‌హారాల వరకే ఆయ‌న ప‌రిమిత‌మైతే మంచిదన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల‌కు కేంద్రం ఎంత ఇచ్చిందో చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

దేశంలో ప్ర‌జ‌ల సొమ్మంత‌టినీ గుజ‌రాత్ ఎలా త‌ర‌లిస్తార‌ని, అమిత్ షా ఇప్ప‌టికైనా దుర్మార్గ‌పు ఆలోచ‌న‌లు మానుకోవాల‌ని హితవుప‌లికారు. రాష్ట్రానికి న్యాయం చేయాల‌ని అడిగితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ వంటి వాళ్ల‌తో ప్ర‌భుత్వంపై దాడి చేయిస్తున్నార‌ని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ పోటీచేస్తే ఒక్క శాతం ఓట్లు కూడా రావ‌ని ఎద్దేవా చేశారు. న‌మ్మ‌క‌ద్రోహం చేసిన వారికి గుణ‌పాఠం చెప్పేందుకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీని 175 స్థానాల్లో గెలిపించాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. కేంద్రానికి రాష్ట్రాలు బానిస‌లు కాద‌ని ఎన్టీఆర్ ఆనాడే చెప్పార‌ని, ప్ర‌త్యేక హోదా ఆంధ్రుల హ‌క్క‌ని, అది ఇవ్వ‌కుంటే కేంద్రానికి గుణ‌పాఠం త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు. ఒక రాష్ట్రంలో, ఒక జాతితో అన‌వ‌స‌రంగా పెట్టుకోవ‌ద్ద‌ని కేంద్రానికి, అమిత్ షాకు చంద్ర‌బాబు సూచించారు.