Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పార్టీ నేతలంతా నిర్లక్ష్యాన్ని వీడాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆ పార్టీ నేతలకు క్లాస్ తీసుకున్నారు. ఇవాళ అమరావతిలో పార్టీ సమన్వయ భేటీ నిర్వహించారు. ధర్మ పోరాట దీక్షలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నేతలకు బాబు దిశానిర్దేశం చేశారు. నేతలు ఎవరేం చేస్తున్నారో తన దగ్గర నివేదికలున్నాయని, కొంతమంది నేతలు ఇప్పటివరకు సరిగా పనిచేయకపోయినా మారుతారులే అని భావించానని, ఇకపై సహించేది లేదని స్పష్టం చేశారు. తాము ఏం చేసినా చెల్లుతుందనుకుంటే పొరపాటేనని అన్నారు. ఇకపై తాను తీసుకునే చర్యలకు నేతలే బాధ్యత వహించాలని బాబు అన్నారు.
ఇక ధర్మపోరాట సభలను ఏపీలో విస్తృతంగా జరపాలని చంద్రబాబు ఈ సమావేశంలో నిర్ణయించారు. రాబోయే తొమ్మిది నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 75 సభలను ఏర్పాటు చేయాలని పార్టీ నేతలను ఆదేశించారు. ఈ సభల ద్వారా ఆంధ్రప్రదేశ్ కు బీజేపీ, కేంద్ర ప్రభుత్వం చేసిన నమ్మకద్రోహాన్ని ఎండగట్టాలని, ఏపీ లో జరుగుతున్న కుట్ర రాజకీయాలను బహిర్గతం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు బీజేపీ చేతిలో పావులుగా మారారన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు.
వచ్చే ఏడాది మే లోగా ఎన్నికలు పూర్తవుతాయని, ప్రీపోన్ అయితే ఇంకా ముందుగానే జరుగుతాయని బాబు చెప్పారు. ముందస్తు ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని సూచించారు. ఇక.. వారంలో ఒక్కరోజైనా గ్రమాదర్శని పేరిట నేతలంతా గ్రామాల్లో తిరగాల్సిందేని అన్నారు. మూడో ధర్మ పోరాట సభ రాజమండ్రిలో గోదావరి తీరాన పెడితే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చారు. తదుపరి సభ రాయలసీమలో నిర్వహిస్తే మేలని అన్నారు. ఎన్నికల్లోగా అన్ని జిల్లాల్లోనూ ధర్మ పోరాట సభలు పూర్తి చేసేయాలని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు సందర్శనకు ప్రజలు ప్రతిరోజు 13 బస్సులలో వెళ్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఇక గ్రామ దర్శిని కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొనసాగించాలని చంద్రబాబు సమావేశంలో ఆదేశించారు.
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రతిగ్రామానికి వెళ్లి ప్రస్తుత పరిస్థితులను వివరించాలన్నారు. చింతలపూడి కూడా త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఈ ఏడాది వైకుంఠపురం బ్యారేజీ ప్రారంభిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. నాగార్జునసాగర్ కుడి కాలువకు, చింతలపూడికి ఈ నీరు వాడకుంటామని, పెన్నానదికి , సోమశిలకు కూడా నీరు తీసుకెళ్తామన్నారు. బొల్లాపల్లి వద్ద 200 టీఎంసీ కెపాసిటీ రిజర్వాయర్ చేపడతామని, దీని నుంచి సాగర్ కుడి కాలువకు నీరు అందిస్తామని చంద్రబాబు తెలిపారు.ఇక పోలింగ్ కేంద్రాల వారీగా దాదాపు నలభై వేల మంది కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలని, ఈ శిక్షణ ఆగస్టు లోగా పూర్తి చేయాలని నేతలను బాబు ఆదేశించారు.