ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం నేడు ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ధర్మపోరాట దీక్ష చేయనున్నారు. కేంద్రం నుంచి ఏపీ ఎదుర్కొంటున్న వివక్షపై జాతీయ స్థాయిలో చర్చకు ఇది దోహదపడుతుందని ఆయన భావిస్తున్నారు. దీక్ష కోసం ఆదివారం రాత్రే ఢిల్లీకి చేరుకున్న సీఎం.. సోమవారం ఉదయం 8గంటలకు ఏపీ భవన్‌లో దీక్షకు దిగబోతున్నారు. దీక్షకు ముందు మహాత్మాగాంధీ, అంబేడ్కర్‌లకు నివాళులు అర్పించనున్నారు. రాత్రి 8గంటల వరకు ఆయన దీక్ష కొనసాగనుంది. జాతీయ స్థాయిలో విపక్ష నేతలు ఈ దీక్షకు మద్దతు తెలిపే అవకాశం ఉంది. దీక్ష కోసం టీడీపీ శ్రేణులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. దీక్షకు పెద్ద ఎత్తున ప్రాచుర్యం కల్పించేలా ఢిల్లీలో పలుచోట్ల పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. దాదాపు 7వేల మందికి పైగా జనాన్ని దీక్ష కోసం తరలిస్తున్నట్టు సమాచారం.
టీడీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా నేడు ఢిల్లీలోనే గడపనున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీలో దీక్షకు హాజరయ్యేవారి కోసం ఇప్పటికే 800 గదులు, 60 బస్సులు ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఆయన దీక్షకు మద్దతుగా రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన వేల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఢిల్లీ చేరుకున్నారు. శ్రీకాకుళం, అనంతపురం నుంచి రెండు ప్రత్యేక రైళ్ల ద్వారా దాదాపు రెండు వేల మంది కార్యకర్తలు తరలివెళ్లారు. ఏపీ భవన్ ప్రాంగణంలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరగనున్న దీక్ష కోసం భారీ స్థాయిలో వేదికను ఏర్పాటు చేశారు. వెళ్ళిన వారందరికీ భోజన వసతి కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, దీక్ష మరుసటి రోజైన మంగళవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో చంద్రబాబు భేటీ కానున్నారు. ప్రత్యేక హోదా, విభజన హామిల అమలుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిందిగా రాష్ట్రపతిని కోరనున్నారు.