మోడీకి నిరసనల స్వాగతం..ఆందోళనలో బీజేపీ !

ప్రధాని నరేంద్ర మోడీ రేపు ఏపీ పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలంటూ నిరసనలు వేల్లివేత్తుతున్నాయి. ‘మోదీ గో బ్యాక్‌’ అంటూ నినాదాలతో నల్ల జెండాలతో పలు చోట్ల ఆందోళనలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రానికి ద్రోహం చేసిన మోడీ ఏపీలో అడుగు పెట్టవద్దని టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. మోడీ పర్యటనను ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. విజయవాడ లెనిన్‌ కూడలిలో వామపక్ష నేతలు నిరసనకు దిగారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన మోడీ రాష్ట్ర పర్యటనకు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. ఇక మోడీ పర్యటనను నిరసిస్తూ కడప జిల్లాలో మట్టి, నీళ్ల కుండలతో వామపక్షాలు వినూత్నంగా నిరసన తెలిపాయి. గన్నవరం విమానాశ్రయం నుంచి గుంటూరు వెంబడి రహదారిపై పెద్ద ఎత్తున మోడీకి వ్యతిరేకంగా హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో పాటు సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. ఏ మొహం పెట్టుకుని వస్తున్నావ్ ? అంటూ మోడీ తలదించుకుని ఉన్న ఓ ఫొటో పెట్టి ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు మోడీ పర్యటనపై శాంతియుతంగా నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్న నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నేతల్లో గుబులు మొదలైందట. ఎందుకంటే తెలుగుదేశం పార్టీతో కటీఫ్ అయిన తర్వాత మోదీ తొలిసారి రాష్ట్రానికి వస్తున్నారు. దీంతో మోదీ సభకు జన సమీకరణ ఎలా చేయాలన్న దానిపై ఏపీ బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు చేదు అనుభవం ఎదురైన ఎదురైన సంగతి తెలిసిందే. పలాసలో మూడువేల మంది కోసం కుర్చీలు ఏర్పాటుచేయగా.. కనీసం మూడొందల మంది కూడా రాకపోవడంతో షా బస్సులో నుంచే ప్రసంగించి వెళ్లిపోయారు. అనంతరం ఆయన రాష్ట్ర నాయకులకు చివాట్లు పెట్టినట్లు తెలిసింది. దీంతో మోదీ సభకు భారీగా జనాన్ని సమీకరించాలని నేతలు ప్రయత్నాలు చేస్తున్నారట.