ఏపీ ప్రభుత్వం మీద గవర్నర్ కు జగన్ ఫిర్యాదు…!

YS Jagan Complaint To Governor Against AP Government

ఆంధ్రప్రదేశ్‌లోని ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయని కొన్నాల్లగా చెబుతూ వస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఇదే విషయం మీద ఈరోజు గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. రాజ్‌ భవన్‌కు వెళ్లిన జగన్ గవర్నర్‌ నరసింహన్‌ తో సుమారు గంట సేపు భేటీ అయ్యారు. ఏపీలో పోలీసు అధికారుల బదిలీల్లో జరుగుతున్న అక్రమాలు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపైనా ఆయన గవర్నర్‌తో చర్చించినట్లు సమాచారం. డీజీపీ ఆర్పీ ఠాకూర్, ఇంటెలిజెన్స్ ఐజీ తీరుపై సీఈసీకి ఫిర్యాదు చేసిన విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్ రాష్ట్రంలోని వ్యవస్థలన్నింటినీ చంద్రబాబు భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ స్వార్థం కోసం పోలీసులు ఎలా ఉపయోగించుకున్నారో గవర్నర్‌కు వివరించాని పేర్కొన్న ఆయన సర్వేల పేరుతో ప్రభుత్వం గ్రామాల్లో డేటా సేకరించి ప్రతిపక్ష పార్టీకి మద్దతుగా ఉన్నవారిని ఓట్ల జాబితా నుంచి తొలగిస్తోందని గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్నారు.

డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీ అధికార పార్టీకి కొమ్ము కాస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని, వారిని ఎన్నికల విధుల నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరినట్లు చెప్పారు. ఓ వ్యక్తిని మరొకరిని కత్తితో పొడిచి తిరిగి ఆ హత్యకు నిరసనగా దీక్ష ఎలా ఉంటుందో చంద్రబాబు దీక్ష అలాగే ఉందని జగన్ ఎద్దేవా చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబు కారణమని హోదా సంజీవని కాదని అసెంబ్లీలో ఆయన మాట్లాడిన తీరును ఎవరూ మరిచిపోలేదని, హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన అరుణ్ జైట్లీకి ధన్యవాదాలు తెలుపుతూ శాసనసభలో తీర్మానం చేసింది చంద్రబాబె కదా నాలుగేళ్ల బీజేపీతో సంసారం చేసిన సమయంలో హోదా గురించి మాట్లాడని చంద్రబాబు ఎన్నికలు సమీపిస్తున్నందున దొంగ దీక్షలు చేపడుతున్నారని జగన్ మండిపడ్డారు.