వికారాబాద్ కలెక్టర్‌ మీద సస్పెన్షన్ వేటు…అదే రీజన్…!

Vikarabad Collector Suspended For Violating Election Norms

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తించారంటూ వికారాబాద్ జిల్లా కలెక్టర్‌ సయ్యద్ ఉమర్ జలీల్‌‌పై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాక ఆయన చేసిన పనికి ఆయన్ని తక్షణమే సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదుతో కలెక్టర్‌పై ఈసీ ఈ చర్యలు తీసుకుంది. నిబంధనలకు విరుద్దంగా స్ట్రాంగ్ రూమ్‌లో ఉన్న ఈవీఎంలను ఆయన తెరిచారంటూ కలెక్టర్‌పై గతంలోనే ఫిర్యాదు చేయగా, దాన్ని తాజాగా విచారించిన ఈసీ కలెక్టర్‌ను సస్పెండ్ చేయాలని ఈరోజు ఆదేశాలు జారీ చేసింది. నిజానికి వోట్ల లెక్కింపు సమయంలోనే నిబంధనలకు విరుద్దంగా స్ట్రాంగ్‌ రూమ్‌ల్లోని ఈవీఎంలను తెరిచిన వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ను సస్పెండ్‌ చేయాలని, మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని కాంగ్రెస్‌ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఏఐసీసీ ఎన్నికల కమిటీ అధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ ప్రతినిధి బృందం సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌ను కలిసి కలెక్టర్‌పై ఫిర్యాదు చేసింది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయాని వికారాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రసాద్‌ కుమార్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసినప్పటికీ, కలెక్టర్‌ ఈవీఎంలను తెరిచిన విషయంలో కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. కోర్టు ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోకుండా కలెక్టర్ సుమారు వంద ఈవీఎంల సీళ్లు తీశారంటూ కాంగ్రెస్ నేతలు తమ ఫిర్యాదు పేర్కొన్నారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం కలెక్టర్‌ను సస్పండ్ చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది.