కేంద్రానికి రెండు రోజుల డెడ్ లైన్ పెట్టిన చంద్ర‌బాబు

Chandrababu put 2 days deadline to BJP Over AP Special Status
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ప్ర‌త్యేక హోదాతో పాటు విభ‌జ‌న హామీల అమ‌లు విష‌యంలో కేంద్ర‌ప్ర‌భుత్వం చూపిస్తున్న నిర్ల‌క్ష్యాన్ని అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ఎండ‌గ‌ట్టారు. విభ‌జ‌న చ‌ట్టంలో ఉన్న‌వ‌న్నీ అమ‌లుచేయాల‌ని ఐదుకోట్ల‌మంది ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల త‌ర‌పున కేంద్రాన్ని మ‌ళ్లీ మ‌ళ్లీ డిమాండ్ చేస్తున్నాన‌ని చంద్ర‌బాబు అన్నారు. అసెంబ్లీలో సుమారు రెండున్న‌ర గంట‌ల‌పాటు సుదీర్ఘంగా ప్ర‌సంగించిన చంద్ర‌బాబు నాలుగేళ్ల‌గా హామీల అమ‌లుకోసం ముఖ్య‌మంత్రిగా తాను చేసిన ప్ర‌య‌త్నాల‌ను, బీజేపీ ప్ర‌భుత్వ వైఖ‌రిని వివ‌రించారు. ఎన్నిక‌ల హామీలను ఎందుకు నెర‌వేర్చ‌డంలేద‌ని కేంద్ర‌ప్ర‌భుత్వాన్ని చంద్ర‌బాబు నిల‌దీశారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల విష‌యంలో ఎక్క‌డా రాజీప‌డ‌బోన‌ని, రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కోసమే టీడీపీ, బీజేపీ క‌లిశాయ‌ని గుర్తుచేశారు. రాష్ట్ర‌విభ‌జ‌న స‌మ‌యంలో న‌ష్ట‌పోయిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ప‌దేళ్ల‌పాటు ప్ర‌త్యేక‌హోదా ఇస్తామ‌ని ప్ర‌క‌టించిన బీజేపీ ఇప్పుడెందుకు ఇవ్వ‌డం లేద‌ని, ప్ర‌త్యేక హోదా ఏపీ హ‌క్క‌ని ప్ర‌జ‌లు భావిస్తున్నార‌ని, దాన్ని గౌర‌వించాల్సిన బాధ్య‌త కేంద్ర‌ప్ర‌భుత్వంపై ఉంద‌ని వ్యాఖ్యానించారు.

రాష్ట్రాన్ని హేతుబ‌ద్ధ‌త లేకుండా విభ‌జించార‌ని, దానివల్లే ఇరు రాష్ట్రాల మధ్య త‌ల‌స‌రి ఆదాయంలో తేడావ‌చ్చింద‌ని తెలిపారు. గ‌త ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో మోడీ ప్ర‌ధాని అభ్య‌ర్థిగా మాట్లాడుతూ కాంగ్రెస్ బిడ్డ‌ను బ‌తికించి, త‌ల్లిని చంపేసింద‌ని విమ‌ర్శించార‌ని, తాను ప్ర‌ధాని అయితే త‌ల్లీబిడ్డ‌లిద్ద‌రినీ బ‌తికించేవాడిన‌ని చెప్పార‌ని గుర్తుచేశారు. తాను ప్ర‌స్తుతం ఆ విష‌యాన్నే అడుగుతున్నాన‌ని, ఇద్ద‌రికీ న్యాయంచేస్తాన‌ని చెప్పిన మీరు… విభ‌జ‌న చ‌ట్టంలో ఉన్న‌వాటిని ఎందుకు నెర‌వేర్చ‌డంలేద‌ని మోడీని చంద్ర‌బాబు సూటిగా ప్ర‌శ్నించారు. తాను 29 సార్లు ఢిల్లీకి వెళ్లి, అంద‌రినీ క‌లిసి ప‌దే ప‌దే విజ్ఞ‌ప్తిచేశాన‌ని, అయినా ఫ‌లితం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తంచేశారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోస‌మే ఇంకా సంయ‌మ‌నం పాటిస్తున్నామ‌ని చెప్పారు. రాష్ట్రానికి అన్యాయం జ‌రిగింది కాబ‌ట్టి న్యాయం చేయాల‌ని అడుగుతున్నామ‌ని, ప్ర‌జ‌ల మ‌నోభావాల‌తో ఆడుకోవ‌డం మంచిది కాద‌ని చంద్ర‌బాబు సూచించారు.

పోల‌వ‌రం ప్రాజెక్టును రాష్ట్రప్ర‌భుత్వం నిర్మిస్తే అనుకున్న స‌మ‌యానికి పూర్త‌వుతుంద‌ని భావించి రాష్ట్రానికి ఇవ్వాల‌ని నీతిఅయోగ్ సిఫార్స్ చేసింద‌ని, ఇప్ప‌టివ‌ర‌కు పోల‌వ‌రం కోసం రూ. 13,054 కోట్లు ఖ‌ర్చుపెట్టగా… కేంద్రం రూ. 5,349.70కోట్లు ఇచ్చింద‌ని, ఇంకా రూ. 2,568 కోట్లు రావాల్సి ఉంద‌ని వెల్ల‌డించారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత గ‌వ‌ర్న‌ర్ పాల‌న‌లో ఆదాయ లోటు నిర్ధారించార‌ని, రెవెన్యూ లోటు రూ. 16,072కోట్లు ఉంద‌ని అప్ప‌ట్లో తేల్చార‌ని, కేంద్రం మాత్రం రూ. 3,900 కోట్లు మాత్ర‌మే ఇచ్చింద‌ని, మిగిలిన వాటి గురంచి అడిగితే లెక్క‌లు అడుగుతున్నార‌ని, రెవెన్యూ లోటు కింద ఇచ్చిన నిధుల‌కు లెక్క‌లు చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌ని ముఖ్య‌మంత్రి స్ప‌ష్టంచేశారు. విభ‌జ‌న న‌ష్టాల‌ను పూర్తిచేయాల్సిన బాధ్య‌త కేంద్రానిదేన‌ని, విశాఖ రైల్వేజోన్ స‌హా రాష్ట్రానికి ఇవ్వాల్సిన‌వ‌న్నీ ఇవ్వాల్సిందేన‌ని స‌భ ద్వారా డిమాండ్ చేస్తున్నాన‌ని ముఖ్య‌మంత్రి వ్యాఖ్యానించారు.