మోడీ ఎదుటే నిర్మొహమాటంగా… మమత, నితీష్ ల మద్దతు !

Chandrababu Speech in Niti Aayog Meeting in front of Modi

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అధ్య‌క్ష‌త‌న నిన్న ఢిల్లీలో జ‌రిగిన నీతీ ఆయోగ్ స‌మావేశంలో రాష్ట్ర స‌మ‌స్య‌ల్ని సీఎం చంద్ర‌బాబు జాతీయ స్తాయిలో వినిపించారు. వాస్త‌వానికి ముఖ్య‌మంత్రులంద‌రికీ 7 నిమిషాలు చొప్పున మాత్ర‌మే మాట్లాడేందుకు అవ‌కాశం క‌ల్పించారు. చంద్రబాబు కూడా ఏడు నిముషాలు దాటి ప్రసంగిస్తున్న సమయంలో హోం మంత్రి రాజనాద్ సింగ్ అడ్డు తగిలారు. మీ సమయం అయిపోయినందున ఇక కూర్చోవాలని కోరారు. అయితే విభ‌జ‌న ఎదుర్కొన్న ఏపీని ప్ర‌త్యేక రాష్ట్రంగా చూడాల‌నీ, తమకు స‌మ‌స్య‌లు చాలా ఉన్నాయ‌నీ, కాబ‌ట్టి త‌న ప్ర‌సంగాన్ని ప్ర‌త్యేకంగా పరిగణించాలంటూ తనకు కేటాయించిన దానికి మూడు రెట్లు అంటే దాదాపు 21 నిమిషాల‌కుపైగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాట్లాడారు.

మోడీ సహా భారత్ లో అన్ని రాష్ట్రాల సీఎం లు సమావేశంలో ఉండగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని వాటితో పాటు ముందు హామీ ఇచ్చినట్టుగానే విశాఖ రైల్వేజోన్‌, క‌డ‌ప స్టీల్ ప్లాంట్ వంటివి వెంట‌నే ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేశారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు సాకుగా చూపి ప్రత్యేక హోదా ఇవ్వ‌లేద‌నీ, కానీ అసలు ఏపీకి హోదా ప్ర‌క‌టించాల్సిన అవ‌స‌రాన్ని ముఖ్య‌మంత్రి వివ‌రించారు. ఏపీలో విద్యా సంస్థ‌ల‌కు కూడా నిధులు అర‌కొరగా విడుద‌ల చేశార‌నీ, దీంతో నిర్మాణాలు పూర్తి కాలేద‌ని ఆయా పేర్కొన్నారు. ఆంధ్రా ప్ర‌జ‌లు విభ‌జ‌న‌ను కోరుకోలేద‌నీ, కానీ విభ‌జ‌న జ‌రిగిన త‌రువాత న‌ష్ట‌పోయిన ఆంధ్రాను అన్ని విధాలుగా ఆదుకుంటామ‌ని భాజ‌పా ఎన్నిక‌ల మేనిఫెస్టోలో కూడా ప్ర‌క‌టించింద‌ని, పార్ల‌మెంటులో ఇచ్చిన హామీల‌ను కేంద్రం అమ‌లు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని బాబు పేర్కొన్నారు.

రాష్ట్రానికి రాజ‌ధాని కూడా లేద‌నీ, దీంతోపాటు పోల‌వ‌రం ప్రాజెక్టుకి కూడా నిధులు మంజూరు చేయాల్సి ఉంద‌ని రెవెన్యూ లోటు భ‌ర్తీతోపాటు, వెనుక‌బ‌డిన ఏడు జిల్లాల‌కు చేస్తామ‌న్న ఆర్థిక సాయాన్ని కూడా విడుద‌ల చేయాల్సి ఉందని అన్నారు. అలాగే మోడీ తన ప్రత్యేక చర్యగా భావించే నోట్ల ర‌ద్దు గురించి మాట్లాడుతూ ఈ నిర్ణ‌యం వ‌ల్ల ప్ర‌జ‌లు చాలా ఇబ్బందులు ప‌డ్డార‌న్నారు. ఇప్ప‌టికీ న‌గ‌దు ల‌భ్య‌త దేశ‌వ్యాప్తంగా స‌మ‌స్య‌గానే ఉంద‌నీ, దీంతో చిన్న వ్యాపారులు, రైతులు అవ‌స్థ‌లు ప‌డుతున్నార‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. ఇలా మొత్తం 35 పాయింట్ల‌ను ప్ర‌ధాని ముందు చంద్ర‌బాబు వివ‌రించారు.

నిజానికి, పార్ల‌మెంటు బ‌డ్జెట్ స‌మావేశాల్లో కూడా ఏపీ స‌మ‌స్య‌ల గురించి వినేందుకు ప్ర‌ధాని అందుబాటులో లేకుండా పోయిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌రువాత‌, నేరుగా ఏపీ స‌మ‌స్య‌ల‌ను ప్ర‌ధాని నిన్న నీతి ఆయోగ్ పుణ్యమా అని విన్నారు. అయితే ఈ విషయాల మీద మోడీ అయితే స్పందించలేదు కానీ బాబు ప్రతిపాదనలకి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మద్దతు ప్రకటించారు. అలాగే బాబు ప్రత్యేక డిమాండ్ ను బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సమర్థించారు. ఏపీతో పాటు, బీహార్ కు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.