చంద్రయాన్-2 ప్రయోగం కీలక దశకు చేరుకుంది. విక్రమ్ ల్యాండర్ ఆర్బిటర్ నుంచి విడిపోయే రెండో కార్యక్రమం కూడా విజయవంతమైంది. దీంతో.. ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-2 చంద్రుడికి మరింత దగ్గరగా వెళుతోంది. ఇప్పటి వరకు చంద్రయాన్-2 పూర్తి చేసుకున్న దశలన్నింటిలో ఇదే అత్యంత ప్రధానమైనది.
జూలై 22న చంద్రుడి వైపు తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆర్బిటర్ ఆగస్టు 20న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. ఆ తర్వాత లూనార్ బౌండ్ ఆర్బిట్ ఆపరేషన్ ద్వారా శాస్తవ్రేత్తలు ఐదుసార్లు కక్ష్యను తగ్గించి ఆర్బిటర్‌ను జాబిల్లికి మరింత చేరువలోకి తీసుకెళ్లారు. ఆర్బిటార్ నుంచి విడిపోయిన ల్యాండర్ కక్ష్య తగ్గింపు రెండు రోజులుగా విజయవంతంగా చేస్తున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు.
క్రమంగా ఆర్బిటార్ కక్ష్యను చంద్రుని కక్ష్యలోకి తగ్గిస్తూ జాబిల్లికి చేరువ చేస్తున్నారు. ఇలా ఎలాంటి అవాంతరం లేకుండా చంద్రయాన్-2 లక్ష్యం దిశగా దూసుకుపోతోంది. చంద్రయాన్ 2లోని ఆర్బిటార్ ఇప్పుడు చంద్రునికి దగ్గరగా ఉంది. ఆర్బిటార్ నుంచి విడిపోయిన విక్రమ్ ల్యాండర్ ఇప్పుడు చంద్రునికి 35 కిలోమీటర్ల పరిధిలో సంచరిస్తోంది. మరో రెండు రోజుల్లో ల్యాండర్ క్రమంగా జాబిల్లికి మరింత దగ్గర కానుంది.
చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తున్న విక్రమ్ ల్యాండర్ దాదాపు 15 నిమిషాల పాటు ప్రయాణించి చంద్రుడి దక్షిణ ధృవంపై నిర్దేశించిన ప్రాంతంలో దిగనుంది. ఈ 15 నిమిషాల్లోనే అత్యంత ఉత్కంఠ కలిగిస్తాయని ఇస్రో అభివర్ణించిందంటే ఈ ఫీట్ ఎంత సంక్లిష్టమైనదో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఆర్బిటర్ మాత్రం మరో ఏడాది పాటు చంద్రుడి చుట్టూ తన పరిభ్రమణాన్ని కొనసాగించనుంది.