మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెం.150’తో నిర్మాతగా మారిన రామ్ చరణ్ వరుసగా చిత్రాలను చేస్తున్నాడు. ఖైదీ నెం.150 చిత్రంతో దాదాపు 50 నుండి 60 కోట్ల వరకు లాభాలను దక్కించుకున్న చరణ్ ప్రస్తుతం చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమాను 250 కోట్ల బడ్జెట్‌తో చరణ్ నిర్మిస్తుండటం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. సైరా చిత్రం తర్వాత చిరంజీవి చేయబోతున్న సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా క్లారిటీ వచ్చేసింది. అయితే ఆ సినిమా నిర్మాత విషయంలో కాస్త గందరగోళం నెలకొంది.
మొదట చిరంజీవి, కొరటాల కాంబోలో రూపొందబోతున్న చిత్రాన్ని మైత్రి మూవీస్ బ్యానర్ నిర్మాతలు నిర్మించబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మైత్రి వారితో పాటు రామ్ చరణ్ కూడా నిర్మాణ వ్యవహారంలో భాగస్వామ్యం కాబోతున్నాడు. దాదాపు 80 కోట్లతో ఆ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్దం అవుతున్నారు. సగం షేర్ చొప్పున మైత్రి మూవీస్ మరియు చరణ్‌లు సినిమాను నిర్మించాలని ఒప్పందంకు వచ్చారు. చిరంజీవి పారితోషికంతో పాటు, ఇతరత్ర ఖర్చులు పోను చరణ్ 25 కోట్ల మేరకు సినిమాకు ఖర్చు చేయబోతున్నాడు. తండ్రితో చేస్తున్న సినిమాలు అన్ని కూడా భారీగా లాభాలను తెచ్చి పెడతాయనే ఉద్దేశ్యంతో చరణ్ ఇలా ప్రతి సినిమాను కూడా తన నిర్మాణ భాగస్వామ్యంలో చేయాలని భావిస్తున్నాడు. మొత్తానికి చరణ్ నిర్మాతగా కూడా చాలా తెలివిగా ఆలోచిస్తున్నాడు.