క్రిస్మస్ రద్దీ దృష్ట్యా, చెన్నై నుంచి రాష్ట్రంలోని తూత్తుకుడి, మదురై, తిరుచ్చి వైపుగా సాగే విమానాల్లో చార్జీలు భారీగా పెరిగాయి. ఆయా విమాన సంస్థల వెబ్సైట్లో ఇది వరకు ఉన్న చార్జీ కన్నా రెట్టింపు చార్జీలు ఉండడంతో ప్రయాణికులకు షాక్ తప్పలేదు. క్రిస్మస్ దృష్ట్యా, చెన్నై నుంచి తూత్తుకుడి, మదురై, తిరునవంతపురం, కొచ్చి వైపుగా వెళ్లే విమానాల టికెట్లు ముందుగానే రిజర్వ్ అయ్యాయి. చెన్నై నుంచి తూత్తుకుడికి ›రోజూ 4 విమానాలు, మదురైకు 6, కొచ్చికి, తిరువనంతపురానికి తలా రెండు విమానాలు నడుపుతున్నారు.
తూత్తుకుడి చెన్నై నుంచి సాధారణంగా రూ. 3,500 టికెట్ చార్జీ కాగా, ప్రస్తుతం రూ. 10,500, రూ.12 వేలుగా చార్జీలు ఉండటం ప్రయాణికుల్ని విస్మయానికి గురి చేశాయి. అలాగే, మదురైకు రూ. 3,500 ఉన్న చార్జీ తాజాగా రూ. 9,800, తిరువనంతపురానికి రూ. 4 వేలు ఉన్న చార్జీ తాజాగా రూ. 9 వేలుగా, కొచ్చికి రూ. 3,500 ఉన్న చార్జీ రూ. 9,500గా పేర్కొనడం గమనార్హం. ఈ పెంపు గురించి ఆయా విమాన సంస్థల ప్రతినిధుల్ని ప్రశ్నించగా, తాము చార్జీలు పెంచలేద, మీడియం, తక్కువ చార్జీ టికెట్లు పూర్తిగా రిజర్వ్ కావడంతో, కొన్ని తరగతుల టికెట్ల ధర పైన పేర్కొన్నట్టుగానే కొంత ఎక్కువగా ఉంటాయని వివరించారు. ఇక, చెన్నై నుంచి శుక్ర, శనివారాల్లో గోవా వైపుగాసాగే విమానాలు ఫుల్ అయ్యాయి.