మహా నగరంలోకి మాయగాళ్లు ప్రవేశించారు. అత్యాశకు పోయేవారిని లక్ష్యంగా దోపిడీలకు పాల్పడుతున్నారు. చౌకగా బంగారం విక్రయిస్తామని నమ్మించి సుమారు రూ.20 లక్షలు దోచుకుపోయిన సంఘటన సోమవారం పీఎం పాలెం పరిసరాల్లో తీవ్ర అలజడి సృష్టించింది. స్థానిక నేర విభాగం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
నగరానికి చెందిన కోటేశ్వరరావు అనే వ్యక్తి మరో ముగ్గురుతో కలసి సోమవారం మధ్యాహ్నం పీఎంపాలెంలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం సమీపంలో చౌకగా బంగారం విక్రయిస్తామని చంద్రశేఖర్ అనే వ్యక్తి చెప్పిన మాటలు నమ్మి వచ్చాడు. కోటేశ్వరరావు తన వెంట రూ. 20లక్షలు కూడా తీసుకొచ్చాడు.
అప్పటికే అక్కడ ఇరానీ గ్యాంగ్ సభ్యులు మాటు వేసి ఉన్నారు. చంద్రశేఖర్ కూడా ఆ గ్యాంగ్ సభ్యుడే. పోలీసులు ఆ ప్రాంతానికి వస్తున్నట్టుగా అలజడి సృష్టించి కోటేశ్వరరావు చేతిలోని రూ.20 లక్షల నగదు ఉన్న బ్యాగ్‌ను లాక్కుని అక్కడి నుంచి వారు వచ్చిన వాహనంలో పరారయ్యారు. వారి వెంట చంద్రశేఖర్ కూడా ఉడాయించాడు.
అయితే పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మాత్రం ఈ ప్రాంతంలో స్థలం కొనడానికి నగదు తీసుకొచ్చామని, తమను రప్పించిన రియల్ ఎస్టేట్ బ్రోకర్, మరికొంత మంది బలవంతంగా డబ్బు ఉన్న బ్యాగును లాక్కుని పరారయ్యరని బాధితుడు పేర్కొన్నా డు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని స్థానిక సీఐ రామచంద్రరావు తెలిపారు. అయితే ఫిర్యాదులో అనేక అనుమానాలున్నాయని, వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.