డిసెంబర్ 31 వరకు కేంద్ర ప్రభుత్వం భారత్ బంద్ ప్రకటించినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కొందరు నిజమో కాదో అని తెలుసుకోకుండా ఇతరులకు ఈ పోస్టుని షేర్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఒక గందరగోళం నెలకొంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఈ పోస్ట్ నకిలీదని స్పష్టం చేసింది.
“సోషల్ మీడియాలో వైరల్ చిత్రంలో డిసెంబర్ 31 వరకు భారత్ బంద్ ప్రకటించినట్లు పేర్కొన్నారు! కానీ, ఏ లాక్డౌన్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అటువంటి ప్రకటన చేయలేదు. దయచేసి అటువంటి తప్పుదోవ పట్టించే చిత్రాలు లేదా సందేశాలను షేర్ చేయవద్దు” అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెకింగ్ టీమ్ ట్వీట్ చేసింది. దేశంలో ఓమిక్రాన్ వేరియంట్ కేసులు ఎక్కువగా నమోదవతున్న సమయంలో ఈ నకిలీ సందేశం ప్రసారం అవుతోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కోరింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అనేది నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఆధ్వర్యంలో నడుస్తున్న వెబ్సైట్. నిజనిర్ధారణ విషయాలతో ప్రజల్లో అవగాహన కల్పిస్తుంటుంది.