మిగ్జాం తుపాను ప్రభావంతో చెన్నై అతలాకుతలమైంది. గత రెండ్రోజులుగా అస్తవ్యస్తమైన ఆ నగరం తుపాను తీరం దాటి ఏపీకి చేరడంతో కాస్త శాంతించింది. చెన్నైలో పరిస్థితులు ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నాయి. వర్షాలు నెమ్మదించి అక్కడ వాతావరణం కాస్త శాంతించినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ నేపథ్యంలో వర్షాలు తెరిపినివ్వడంతో చెన్నై ఎయిర్పోర్టులో విమానాల రాకపోకలు పునరుద్ధరించారు.
భారీ వర్షాల కారణంగా ఎయిర్పోర్టులో పోటెత్తిన వరదతో సోమవారం రోజున రాకపోకలు నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు పరిస్థితులు కుదుటపడటంతో ఇవాళ ఉదయం ఎయిర్పోర్టులో విమానాల రాకపోకలను పునరుద్ధరించారు. మరోవైపు వర్షం తగ్గుముఖం పట్టినా చెన్నైలో ఇంకా కొన్ని చోట్ల వరద నీరు నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
భారీ వర్షాలకు రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. నదులు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కూవమ్ నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పరిసర ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరి ప్రజలకు తిప్పలు తెచ్చింది. మరోవైపు తుపాను హెచ్చరికల నేపథ్యంలో కాంచీపురం, చెన్నై, చెంగల్పట్టు, తిరువళ్లూరు జిల్లాల్లో విద్యా సంస్థలు, ఆఫీసులకు ఈరోజు కూడా సెలవు ప్రకటించారు.