శంషాబాద్‌లో వెటర్నరీ డాక్టర్‌పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణంగా చంపేసిన ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ పోలీసులపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కామంతో రెచ్చిపోయి అమాయకురాలి ప్రాణం తీసిన మృగాళ్లకు పోలీసులు సరైన శిక్ష విధించారంటూ అన్నివర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
ప్రస్తుతం గర్భవతిగా ఉన్న చెన్నకేశవులు భార్య ఎన్కౌంటర్ విషయం తెలియగానే విషాదంలో మునిగిపోయింది. తన భర్త నేరం చేసినట్లు నిర్ధారించి తీర్పు ఇవ్వకముందే పోలీసులు ఇలా చేయడం తప్పని ఆమె అంటోంది. వారం రోజుల క్రితం తన భర్తను ఇంట్లో నుంచి బలవంతంగా తీసుకెళ్లారని, ఇన్నిరోజులు కనీసం ఆయన్ని కలిసేందుకు కూడా అనుమతించలేదని చెబుతోంది. మీ ఆయన ఇంటికి వచ్చేస్తాడులే, ఇప్పుడు కలిసేందుకు ఎందుకు తొందర అంటూ కొందరు నన్ను వారించారని, కానీ ఇప్పుడు ఆయన ప్రాణమే తీశారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనకు ఇంత అన్యాయం చేసిన పోలీసులు తన భర్తను చంపిన చోటికే తననూ తీసుకెళ్లి చంపేయాలని కోరుతోంది. తన భర్త లేని లోకంలో తాను బతకలేనని ఆమె అంటోంది.