పెంచుకుంటున్న కోళ్లను ఉచితంగా ఇవ్వలేదని కోళ్లను చంపేశారు ఇద్దరు దుండగులు. ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఆదివారం చోటు చేసుకుంది. ఝాన్సీ రోడ్ పోలీసు స్టేషన్ పరిధిలో గుడ్డి భాయ్ అనే మహిళ తన కుమార్తెతో కలిసి నివాసముంటోంది. ఈవిడ రోజువారి కూలీ. కూలీ డబ్బులు కుటుంబ పోషణకు సరిపోకపోవడంతో.. ఇంటి వద్ద నాలుగైదు కోళ్లను పెంచుకుంటుంది. కోళ్లు పెట్టిన గుడ్లను అమ్ముకొని.. వచ్చిన డబ్బుతో చిన్న చిన్న అవసరాలు తీర్చుకుంటుంది. అయితే ఆదివారం ఉదయం గుడ్డి భాయ్ ఇంట్లో లేని సమయంలో ఇద్దరు వ్యక్తులు ఆమె ఇంటికి వచ్చారు. ఉచితంగా ఓ కోడిని ఇవ్వాలని ఆమె కూతురిని అడిగారు. వారి ప్రతిపాదనను కూతురు తిరస్కరించడంతో.. కోపోద్రిక్తులైన ఆ ఇద్దరు వ్యక్తులు.. అక్కడున్న కోడి పుంజును చంపేశారు. మిగతా నాలుగు కోళ్లకు విషాహారం తినిపించారు. దీంతో ఐదు కోళ్లు చనిపోయాయి. చనిపోయిన కోళ్లను తీసుకొని ఝాన్సీ రోడ్ పోలీసు స్టేషన్కు వెళ్లింది గుడ్డి భాయ్. కోళ్లను చంపేసిన సురేందర్, సుమర్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.