ప్రధాని వ్యాఖ్యలు ప్రతి ఒక్కరినీ కలవరపరిచాయి : చిదంబరం

ప్రధాని వ్యాఖ్యలు ప్రతి ఒక్కరినీ కలవరపరిచాయి : చిదంబరం

అఖిలపక్ష సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం ధ్వజమెత్తారు. భారత సరిహద్దుల్లోకి ఎవ్వరూ చొరబడలేదన్న మోదీ వ్యాఖ్యలపై ఆయన విరుచుకుపడ్డారు. ఈ మేరకు శనివారం చిదంబరం స్పందిస్తూ.. ‘మోదీ వ్యాఖ్యలు ఇంతకముదు ఆర్మీ చీఫ్, రక్షణ, విదేశాంగ శాఖ మంత్రులు చేసిన ప్రకటనలకు విరుద్ధంగా ఉన్నాయి. ప్రధాని వ్యాఖ్యలు ప్రతి ఒక్కరినీ కలవరపరిచాయి. మే 5,6న చైనా బలగాలు మన భూభాగంలోకి ప్రవేశించకపోతే, మన సైనికులు ఎక్కడ గాయపడ్డారు, ఎందుకు అమరులయ్యారు’ అని ప్రశ్నించారు.

కాగా భారత భూభాగంలో ఎవరూ ప్రవేశించలేదని శుక్రవారం ప్రధానమంత్రి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. భారత్‌ వైపు కన్నెత్తి చూసిన వారికి సైనికులు గుణపాఠం నేర్పారని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా ఈ నెల 16న గల్వాన్‌ లోయలో చైనా- భారత్‌ బలగాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. ఇక ఇదే విషయంపై కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ కూడా ప్రధాని వ్యాఖ్యలపై ప్రశ్నలు సంధించారు. చైనా దురాక్రమణకు తలొగ్గిన ప్రధాన భారత భూభాగాన్ని చైనాకు అప్పగించారని ఆరోపించారు. ఒకవేళ ఆ భూభాగం చైనా వారిది అయితే భారత జవాన్లు ఎందుకు మరణించారని ప్రధానిని ప్రశ్నించారు.