బాలిక ప్రాణం వచ్చీరాని వైద్యం

బాలిక ప్రాణం వచ్చీరాని వైద్యం

ఓ ఫార్మాసిస్ట్‌ వచ్చీరాని వైద్యం.. ఓ బాలిక మృతికి దారితీసింది. బాధిత కుటుంబానికి తీరని శోకం మిగిల్చింది. వివరాలిలా ఉన్నాయి.. జిల్లా కేంద్రంలోని జగన్నాథ్‌ మందిరం సమీపంలో నివాసముంటున్న సందీప్‌ బెహరా అనే ఫార్మాసిస్ట్‌ తన ఇంటి వద్దనే క్లినిక్‌ నిర్వహిస్తూ తన వద్దకు వచ్చిన రోగులకు వైద్యం చేస్తుంటాడు. బుధవారం ఉదయం 4 రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఎంవీ–44 గ్రామానికి చెందిన వాసుదేవ్‌ బాలా కూతురు వందన బాలాని చికిత్స కోసం ఇతడి వద్దకు తీసుకువచ్చారు.

పరీక్షించిన సందీప్‌ బాలికకు బ్లడ్‌ టెస్ట్‌ చేయించాలని సూచించారు. ఈ పరీక్ష అనంతరం వచ్చిన రిపోర్టులో సదరు బాలికకు ప్లేట్‌లెట్స్‌ తగ్గినట్లు తేలింది. దీంతో మెరుగైన వైద్యం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి బాలికను తరలించేందుకు బాధిత కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. ఆస్పత్రిలో అయితే సకాలంలో వైద్యం అందించరని, ఇక్కడ తానే వైద్యం చేసి, బాగు చేస్తానని సందీప్‌ వారికి నచ్చజెప్పాడు. ఆయన మాటలు నమ్మి, బాలికను అక్కడే ఉంచారు.

ఈ క్రమంలో సందీప్‌ వైద్యం అందించినప్పటికీ తీవ్ర అస్వస్థతతో గురువారం ఉదయం బాలిక కన్నుమూసింది. దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన బాలిక తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు సదురు ఫార్మాసిస్ట్‌ నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ చనిపోయిందని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. అనంతరం సందీప్‌పై ఈడ్చుకుని వెళ్లిమరీ పోలీసులకు అప్పగించి, అతడిపై కేసు నమోదు చేయించారు.