తెలిసీతెలియని వయసది. పొంగుతున్న వేడిపాలను తల్లి ఏవిధంగా ఊదుతుందో చూసి.. తను కూడా అలాగే అనుసరించాలనే ప్రయత్నంలో ఐదేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.ఫీనిక్స్ టౌన్షిప్లో నవంబర్ 23 సాయంత్రం సమయంలో బాలుడి తండ్రి రామ్‌జీ ప్రసాద్ పనిమీద బయటికి వెళ్లాడు.
అతని భార్య రంజూదేవి, కుమారుడు సంజీవ్ కుమార్ , రెండున్నరేళ్ల కుమార్తె స్వీటి ఇంటి వద్ద ఉన్నారు. ఆ రోజు సాయంత్రం తల్లి రంజూదేవి గ్యాస్‌పై పాలు పెట్టి వేరేపని నిమిత్రం వంటగది నుంచి బయటికి వెళ్లడం చూసిన సంజీవ్, బల్లపైకెక్కి ప్లాస్టిక్ పైప్‌తో పాలను ఊదడం ప్రారంభించాడు. ఆ టైంలో వేడి పాలు పైపులోనుంచి నోట్లోకి వెళ్లడంతో వేగంగా శ్వాసపీల్చుకున్నాడు.
దీంతో నోటిలోపలి భాగాలు తీవ్రంగా కాలిపోవడంతో హుటాహుటిన సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స జరుగుతుండగా మూడురోజుల తర్వాత ఆదివారం మృతి చెందాడని వివరించారు. ప్రతిరోజూ తల్లి మరుగుతున్న పాలపై ఊదడం చూసేవాడని, అదేవిధంగా పొంగుతున్నపాలను పైపుతో ఆర్పడానికి ప్రయత్నించి తమ కుమారుడు ప్రాణాలు కోల్పోయాడని తండ్రి రామ్‌జీ ప్రసాద్ తెలుపుడూ కన్నీరుమున్నీరయ్యాడు.