మ్యాన్ హోల్‌ నుంచి అకస్మాత్తుగా మంటలు

మ్యాన్ హోల్‌ నుంచి అకస్మాత్తుగా మంటలు

దీపావళి పండుగ వస్తుందంటే చాలు.. పిల్లలు ఫుల్ జోష్‌లో ఉంటారు. నచ్చినన్ని టపాసులు కాల్చుకోవచ్చని ఉత్సాహపడుతుంటారు. కొందరైతే పండుగకు ఓ రోజు ముందు.. ఓ రోజు తర్వాత కూడా తనివితీరా టపాసులు కాలుస్తుంటారు. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఈ చిన్నారులు.. దీపావళికి పది రోజుల ముందు నుంచే టపాసులను కాల్చడంలో ట్రయల్స్ మొదలుపెట్టారు.

సూరత్‌లోని తులసి దర్శన్ సొసైటీలో.. కొంత మంది చిన్నారులు.. సరిగ్గా ఇంటి గేటు ముందున్న మ్యాన్ హోల్‌ రంధ్రాల్లో టపాసులు ఉంచి కాల్చడానికి ప్రయత్నించారు. అలా అగ్గిపుల్ల అంటించారో లేదో.. మ్యాన్ హోల్‌ నుంచి అకస్మాత్తుగా మంటలు పైకి ఎగిశాయి. మంటలు పైకి రాగానే.. వారంతా తలో దిక్కు పరిగెత్తారు. దీంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

ఆ సొసైటీ అండర్‌గ్రౌండ్ నుంచి గ్యాస్ పైప్‌ లైన్ వేసే పనులు చేస్తున్నారట.. గ్యాస్ పైప్ లైన్ డ్యామేజీ కావడంతోనే.. మ్యాన్ హోల్ నుంచి మంటలు చెలరేగాయని.. మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ ప్రమాదంలో గాయపడిన ఐదుగురు పిల్లలను హాస్పిటల్‌లో చేర్పించి చికిత్స అందించారు. పిల్లలు మ్యాన్ హోల్‌ మీద టపాసులను ఉంచి కాల్చడానికి ప్రయత్నించిన దృశ్యాలు సీసీకెమెరాలో రికార్డయ్యాయి.