మండలంలోని జె.నాయుడుపాలెం గ్రామానికి చెందిన గడదాసు నాగరాజుకు ఆరేళ్ల క్రితం వడ్డిప గ్రామానికి చెందిన సాయితో వివాహం జరిగింది. వీరికి కుమార్తె భాను, కుమారుడు పృథ్వీరాజ్ ఉన్నారు. నాగరాజు ఆటో నడపడం ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బేరాలు తగ్గడంతో వీరికి ఏడాది కాలంగా ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యాయి. కుటుంబ పోషణ భారంగా మారడంతో భార్యాభర్తలు తరచూ గొడవ పడేవారు.
తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించే విషయంలో ఆదివారం రాత్రి వీరిద్దరి మధ్య తలెత్తిన గొడవ.. ఘర్షణకు దారితీయడంతో సాయి మనస్తాపం చెందింది. వెంటనే ఇద్దరు పిల్లలను తీసుకువెళ్లి యాదవుల వీధిలోని బావిలో తోసేసి.. తాను కూడా దూకేసింది. చివరి క్షణంలో ఆమె బావిలోని మెట్టును పట్టుకుని వేలాడుతూ కేకలు వేయడంతో.. చుట్టుపక్కలవారు అక్కడికి చేరుకొని ఆమెను, పిల్లలను బయటకు తీశారు.కానీ అప్పటికే ఇద్దరు చిన్నారులూ మృతి చెందారు.
సాయి ప్రాణాలతో బయటపడింది. ఈ సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ నాగకార్తీక్ ఘటనాస్థలికి చేరుకొని.. తల్లి సాయితో పాటు స్థానికులను విచారించారు. తన భార్య తోసేయడం వల్లే పిల్లలు చనిపోయారని నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ తల్లిని బాధించింది. కుటుంబ ఆర్థిక పరిస్థితులే తనను ఈ ఘటనకు ప్రేరేపించాయని ఆమె పోలీసుల ఎదుట గొల్లుమంది. చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.