Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు మనదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికలిగిస్తున్నాయి. గుజరాత్ ఫలితాల కోసం చాలా దేశాలు ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. ముఖ్యంగా డ్రాగన్ దేశం గుజరాత్ ఎన్నికలు, ఎగ్జిట్ పోల్స్, ఫలితాలపై తెగ ఆసక్తి కనబరుస్తోంది. చైనా పత్రిక గ్లోబల్ టైమ్స్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ మేరకు ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ నెల 18న వెల్లడయ్యే ఫలితాలపై చైనాకు చెందిన నిపుణులు ఆసక్తి కనబరుస్తున్నారని, చాలా మంది చైనా విశ్లేషకులు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఆసక్తిగా గమనించారని ఆ పత్రిక తెలిపింది. ప్రధాని ఇటీవలి కాలంలో తీసుకున్న సంస్కరణలకు ఇది ఓ పరీక్షని , ఈ ఫలితాలు భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని చైనా అభిప్రాయపడుతోంది.మేక్ ఇన్ ఇండియా, పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి కీలక నిర్ణయాలు ప్రజలపై ఏ మేర ప్రభావం చూపాయో ఈ ఎన్నికలు తెలియజేస్తాయని గ్లోబల్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది.
గుజరాత్ ప్రధాని నరేంద్రమోడీ సొంత రాష్ట్రం కావడంతో పాటు… ఆయన చేపట్టిన కీలక ఆర్థిక సంస్కరణల ప్రభావం ఎంత ఉందో ఈ ఎన్నికల ద్వారా వెల్లడికానుందన్న విశ్లేషణల నేపథ్యంలో చైనా పెట్టుబడిదారులు కూడా గుజరాత్ ఫలితాలపై దృష్టిసారించారు. భారత్ లో తన వ్యాపారాన్ని విస్తరించాలని చైనా భావిస్తుండడంతో… గుజరాత్ ఫలితాలు చైనా కంపెనీల పెరుగుదలకు మరింత ఊతమిస్తాయని పెట్టుబడిదారులు భావిస్తున్నారు. ఇప్పటికే చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలు షియోమీ, ఒప్పో భారత్ లో హవా కొనసాగిస్తున్నాయి. భారత మార్కెట్ లోనూ చైనా పెట్టుబడులు నానాటికీ పెరిగిపోతున్నాయి. గుజరాత్ లో బీజేపీ గెలిస్తే… ప్రధాని చేపట్టిన ఆర్థిక సంస్కరణలకు ప్రజల ఆమోదం లభించినట్టేనని, దానివల్ల భారత్ లో మరిన్ని చైనా కంపెనీల ప్రవేశానికి మార్గం సుగమమవుతుందన్నది ఆ దేశ పెట్టుబడిదారుల ఆలోచన. అటు కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు రాహుల్ గాంధీ విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ ఈ ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచే అవకాశం లేదని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూస్తే అర్ధమవుతోంది. కొన్ని సీట్లు అటూ ఇటుగా దాదాపు అన్ని ఛానళ్ల ఎగ్జిట్ పోల్స్ బీజేపీదే విజయమని తేల్చాయి.