China Opposing India In Social Media
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
డోక్లామ్ వివాదంపై చర్చలకు రాకుండా మొండిపట్టుపడుతూ సమస్యను అంతకంతకూ పెద్దది చేస్తున్న చైనా…అది చాలదన్నట్టు మొన్న మరో సరిహద్దు ప్రాంతం లోనుంచి మనదేశంలోకి చొరబాటుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. లడఖ్ లో ప్యాంగ్యాంగ్ సరస్సుకు సమీపంలోని ఫింగర్ ఫోర్, ఫింగర్ ఫైవ్ ప్రాంతంలోకి చొరబాటుకు ప్రయత్నించిన చైనా సైనికుల్ని భారత సైనికులు మానవకవచంగా ఏర్పడి అడ్డుకున్నారు. దీంతో చైనా సైనికులు రాళ్లదాడికి దిగారు. ప్రతిగా మన సైనికులూ రాళ్లదాడి చేశారు.
భారత్ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటోన్న ఆగస్టు 15న ఈ చొరబాటు యత్నం జరిగింది. రాళ్లదాడితో రెండు దేశాల మధ్య రెండు గంటల పాటు ఉద్రిక్తంగా మారిన పరిస్థితులు బ్యానర్ డ్రిల్ తో చల్లారాయి. రాళ్లదాడికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇరు దేశాల సైనికులు రాళ్లతో దాడిచేసుకోవటం ఈ వీడియోలో కనిపిస్తోంది. డోక్లామ్ వివాదం నుంచి భారత్ దృష్టి మరల్చేందుకే చైనా లడఖ్ లో చొరబాటుకు యత్నించిందని విదేశీనిపుణులు అంటున్నారు. భారత్ -భూటాన్-చైనా ట్రై జంక్షన్ వద్ద చైనా చేపట్టిన రోడ్డు నిర్మాణాన్ని భారత్ అడ్డుకోవటంతో డోక్లామ్ వివాదం మొదలయింది.
భూటాన్ కు చెందిన భూభాగంలో రోడ్డు నిర్మించటం భూటాన్ కే కాక తమ ప్రయోజనాలకూ భంగకరమని భారత్ ఆందోళన చెందుతోంది. రోడ్డు నిర్మాణం ఆపేందుకు చైనా ససేమిరా అనటంతో సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించింది. ద్వైపాక్షిక చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకుందామని భారత్ కోరుతుంటే చైనా మాత్రం సైన్యాన్ని ఉపసంహరించాల్సిందే అని డిమాండ్ చేస్తోంది. మరో పక్క తమ సరిహద్దుల్లో ఉంచిన సైన్యాన్ని మాత్రం వెనక్కి పిలవటం లేదు. చైనా ఒత్తిళ్లకు భారత్ తలొగ్గకపోవటంతో యుద్దం హెచ్చరికలు చేస్తోంది.
చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ లో భారత్ ను హెచ్చరిస్తూ రోజూ కథనాలు వస్తున్నాయి. అవి చాలదన్నట్టు సోషల్ మీడియాలోనూ భారత్ కు వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టింది. ఇలా చైనా ఎన్ని వేషాలు వేసినా భారత్ మాత్రం హుందాగానే బదులిస్తోంది. ఏ క్షణం ఏ పరిస్థితినయినా తట్టుకునేందుకు వీలుగా సరిహద్దు గ్రామాలను ఖాళీ చేయించి సైన్యాన్ని మోహరిస్తోంది. అటు అంతర్జాతీయ సమాజం కూడా ఈ వివాదంలో భారత్ కే మద్దతిస్తొంది. అమెరికా, జపాన్ సూటిగానే డోక్లామ్ ప్రతిష్టంభనపై భారత్ వైఖరిని ప్రశంసించాయి. అయినా చైనా ప్రవర్తనలో మార్పు కనిపించటం లేదు.