చినబాబు మూవీ రివ్యూ… తెలుగు బులెట్

Chinababu Movie Review

నటీనటులు : కార్తీ, సత్య రాజ్, భానుమతి, సాయేషా, ప్రియా భవాని శంకర్, శత్రు
దర్శకత్వం : పాండిరాజ్
నిర్మాతలు: సూర్య, మిరియాల రవీందర్ రెడ్డి
మ్యూజిక్ : డి.ఇమాన్

తెలుగులో మార్కెట్ బాగానే ఉన్న నటుల్లో కార్తీ ఒకరు, ఎంచుకునే కధలు భిన్నంగా ఉండడంతో ఆయన యే సినిమా చేసినా దాని మీద ప్రేక్షులకి అంచనాలు ఉంటాయి. తన ప్రతీ సినిమాను తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ చేస్తూన్న కార్తీ, తాజాగా చినబాబు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పల్లెటూరి కథతో ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను కార్తీ అన్న, కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్య నిర్మించటంతో సినిమా మీద మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. ఇక చినబాబు సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది. ఆ సినిమా ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

చినబాబు ఎవరంటే (కధ) :

పెనుగొండ రుద్రరాజు (సత్యరాజ్)ది జమీందారీ కుటుంబం. ఆయన మొదటి భార్య మాధవి (విజి చంద్రశేఖర్)కు ఆడ పిల్లలే కావడంతో మగ సంతానం కోసం ఆమె చెల్లెలయిన భార్గవి (భానుప్రియ)ను పెళ్లి చేసుకుంటాడు. ఇద్దరికీ ఐదుగురు ఆడపిల్లలు పుట్టిన తర్వాత మాధవికి కొడుకు కృష్ణం రాజు (కార్తి) జన్మిస్తాడు. ఐదుగురు అమ్మాయిల త‌ర్వాత పుట్టిన మ‌గ‌పిల్లాడు కావడంతో గారాబంగా పెరుగుతాడు. అయినా ఎక్కడా జులాయిగా తిరగక ఆర్గానిక్ వ్యవసాయం చేస్తూ తన కుటుంబాన్ని ప్రేమగా చూసుకుంటాడు. అన్ని కుటుంబాల్లో లాగే ఆ కుటుంబంలో కూడా తోడల్లుళ్ళ మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు. వాటిని ఎలా అయినా తొలగించి ఎప్పటికైనా తన కూతుళ్లు, అల్లుల్లు… వాళ్ల పిల్లలను ఇంటికి పిలిచి అందరితో కలిసి ఓ ఫ్యామిలీ ఫొటో తీయించుకోవాలని ఆశపడుతుంటాడు రుద్రరాజు.

రుద్రరాజు ఇద్దరు కూతుళ్లు తమ అమ్మాయిలను కృష్ణంరాజు కు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు. కానీ కృష్ణంరాజు, నీల నీరద (సయేషా)ను ఇష్టపడతాడు. దీంతో కుటుంబంలో గొడవలు మొదలవుతాయి. అదే సమయంలో నీల బావ, సురేంద్ర రాజు (శత్రు)ను ఓ హ్యతకేసులో కృష్ణం రాజు అరెస్ట్‌ చేయిస్తాడు. ఈ నేప‌థ్యంలో త‌న అక్క‌ల‌ను, బావ‌ల‌ను నీల తల్లిదండ్రులను ఒప్పించి కృష్ణంరాజు నీర‌ద మెడ‌లో మూడు ముళ్లు వేశాడా ? ఎవ‌రెవ‌రు అడ్డుప‌డ్డారు? ఎవ‌రెవ‌రు సాయం చేశారు అనేదే కధ.

చినబాబు ఎలా ఉందంటే :

ఉమ్మడి కుటుంబ అనుబంధాల నేపథ్యంలో తెలుగులో గతంలో సినిమాలొచ్చాయి. ఫ్యామిలీ సెంటిమెంట్‌కు కాస్త కామెడీ కలర్ ఫుల్ లోకేషన్స్ కలిపి కొట్టేస్తే చాలు సినిమా హిటయినట్టే. అలా అనుకుని తీసిన చిత్రమే చినబాబు అనిపిస్తుంది. కానీ సినిమా మొత్తానికి రైతుల గురించి చెప్పే సీన్ ఒక్కటే హైలైట్ అని చెప్పొచ్చు. మేనరికాల ప్రభావంతో ఇంట్లో పెరిగిన అక్క కూతురో, లేదంటే మేనమామ కూతురునో కాదని బయటి అమ్మాయిని పెళ్లాడితే కుటుంబంలో ఏ సమస్యలు తలెత్తుతాయనే కథాంశంతో దర్శకుడు పాండిరాజ్ ఈ సినిమాను ఆకట్టుకునేలా తెరకెక్కించారు. దర్శకుడు ఎంచుకున లైన్ అసలు కొత్తది కాక పోయినా కధనం మాత్రం బాగుంది. పల్లెటూరి నేపధ్యం, తమిళ సాంప్రదాయాలు చూపడం సినిమాకి తమిళంలో ప్లస్ అయినా కధ తెలుగు నేటివిటీకి దూరంగా ఉంటుంది. ఊరి మొత్తానికి పెద్ద కుటుంబం అయిన హీరో కుటుంబానికి అదే వూరిలో పుట్టిపెరిగిన హీరోయిన్ తెలియకపోవడం లాంటి లాజిక్స్ మిస్ అవడం కాస్త నిరాశ పరుస్తుంది. అలాగే సినిమాలో కొన్ని చోట్ల బోర్డులు తమిళంలో కొన్ని చోట్ల తెలుగులో కనపడడం కూడా ఎడిటింగ్ మీద శ్రద్ద చూపకపోవడం తెలుస్తుంది.

నటీనటుల విషయానికి వస్తే రైతు పాత్ర కార్తీకి కరెక్ట్ గా నప్పింది. ఇక సత్య రాజ్ నటన బాగున్నా తెలుగులో ఆయన పాత్రకు డబ్బింగ్ చెప్పే గొంతు ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇక కొన్ని చోట్ల కామెడీ కోసం చేసిన ప్రయత్నాలు ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. పాటలు పెద్దగా ఆకట్టుకోకపోయినా ఆర్ఆర్ మాత్రం సినిమాకి ప్రాణం పోసింది. ఇక సినిమాకి ఫైట్లు కూడా పెద్ద అసెట్. వేల్‌రాజ్‌ సినిమాటోగ్రఫి బాగుంది. పల్లె వాతావరణాన్ని అందంగా తెర మీద చూపించారు. నిజానికి యే సంక్రాంతికో దసరాకో రిలీజ్ అయి ఉంటె సినిమా సూపర్ హిట్ అయి ఉండేది.

తెలుగు బులెట్ పంచ్ లైన్ : ఈ చినబాబు పెద్ద మనుసున్న బాబు
తెలుగు బుల్లెట్ రేటింగ్ : 2.75 /5