అర్ధరాత్రి.. చిమ్మచీకటి.. నడిసంద్రంలో ప్రయాణం. ఆ సమయంలో ఓ వ్యక్తి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఏకంగా కార్డియాక్ అరెస్ట్‌కు గురవ్వడంతో తోటి ప్రయాణికులు భయాందోళన చెందారు. కానీ ప్రతికూల వాతావరణంలో అతడిని కాపాడేందుకు సాహసోపేతమైన భారత కోస్ట్‌గార్డ్ ఆపరేషన్ చేపట్టింది.
పనామా పతాకంతో ఉన్న ఎంవీ డాంగ్ ఫాంగ్ కాన్ టాన్ నంబర్ 2 రీసర్చ్ నౌక చైనా నుంచి అరేబియా సముద్రం మీదుగా యూఈఏ వెళ్తోంది.ఈ నౌకలో పనిచేస్తున్న సిబ్బంది యిన్ వీగ్యాంగ్ కార్డియాక్ అరెస్ట్‌కు అయ్యి ఛాతినొప్పితో విలవిల్లాడిపోగా.. నౌక సిబ్బంది ముంబయిలోని మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్‌కు ఎమర్జేన్సీ మెసేజ్ పంపారు.
అప్రమత్తమైన భారత కోస్ట్‌గార్డ్ సిబ్బంది బాధితుడిని అత్యవసరంగా ఆసుపత్రికి చేర్చేందుకు ఏఎల్‌హెచ్ ఎంకే-3 హెలికాప్టర్‌తో బయల్దేరారు. ఆ నౌక 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న చోటుకి సిబ్బంది చేరుకున్నారు .. ప్రతికూల వాతావరణంలోనే ఈ వీగ్‌యాంగ్‌ను ఎయిర్‌లిఫ్ట్ చేసి హెలికాప్టర్లోనే ఆపరేషన్ చేపట్టి ప్రథమ చికిత్స అందించింది. అనంతరం సమీప ఆసుపత్రికి తరలించినట్లు భారత రక్షణ శాఖ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది.