బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించినందుకు లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. బిహార్ సీఎం నితీష్ కుమార్ గెలిచినది ప్రధాని మోడీ వల్ల మాత్రమే అని అన్నారు. బుధవారం చిరాగ్ మీడియాతో మాట్లాడుతూ.. బిహార్‌లోని ఓటర్లు ప్రధాని మోడీపై తమకున్న విశ్వాసం వ్యక్తం చేశారని, రాష్ట్రంలో అభివృద్ధిని సాధించడానికి బిహార్‌లో బీజేపీ బలోపేతం కావడం అవసరమని అన్నారు.
క్లిష్ట పరిస్థితుల్లో ఎల్జేపీ బాగా పోరాడిందని అన్నారు. బిహార్ ఎన్నికల్లో 150 స్థానాల్లో సొంతంగా పోటీచేసి మెజారిటీ స్థానాల్లో మంచి ప్రదర్శన కనబరిచామన్నారు. బిహార్ ఫస్ట్, బిహారీ ఫస్ట్ అనే నినాదంతో పోటీచేసిన 6శాతం ఓట్లు సాధించాము. మమ్మల్ని పిచ్లాగ్ పార్టీ అని పిలిచారు. అయినా మేము ఎవరి మద్దతులేకుండా ధైర్యం చూపించామన్నారు.. దీనిని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని తెలిపారు.
కాగా.. సూపర్ ఓవర్ వరకు సాగిన ఉత్కంఠభరిత టీ 20 మ్యాచ్ లాంటి బిహార్ అసెంబ్లీ ఎన్నికల హోరాహోరీ పోరులో చివరకు అధికార ఎన్డీయే విన్నింగ్ షాట్ కొట్టింది. చివరి ఓవర్ వరకు గట్టి పోటీ ఇచ్చిన ఆర్జేడీ నేతృత్వంలోని మహా కూటమి విజయానికి కొద్ది దూరంలో నిలిచిపోయింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మంగళవారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. చివరకు, మొత్తం 243 స్థానాల అసెంబ్లీలో మెజారిటీ మార్క్ 122 కాగా, అంతకన్నా కేవలం రెండు సీట్లు ఎక్కువ గెలుచుకుని 124 సీట్లతో ఎన్డీయే అధికారంలోకి రానుంది. అయితే, అత్యధిక స్థానాలు గెలుచుకుని ‘పార్టీ ఆఫ్ ది మ్యాచ్’ గా ఆర్జేడీ నిలిచింది.