మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రీకరణ శరవేగంగా హైదరాబాద్ శివారు ప్రాంతంలో జరుగుతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంను వచ్చే సంవత్సరం ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గత సంవత్సరం సంక్రాంతికి వచ్చిన చిరంజీవి దాదాపు రెండున్నర సంవత్సరాల గ్యాప్ తీసుకుని రాబోతున్నాడు. అయితే సైరా తర్వాత ఏమాత్రం గ్యాప్ లేకుండా ఉండానే ఉద్దేశ్యంతో వరుసగా చిత్రాలకు కమిట్ అవుతున్నాడు. చిరంజీవి 152వ చిత్రంగా మొన్నటి వరకు బోయపాటి శ్రీను దర్శకత్వంలో మూవీ ఉంటుందని అంతా భావించారు. కాని అనూహ్యంగా చిరు 152వ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ చిత్రంలో అనుష్కను హీరోయిన్‌గా ఎంపిక చేయడం దాదాపుగా ఖరారు అయ్యింది.
దర్శకుడు కొరటాల శివ ‘భరత్ అనే నేను’ చిత్రం విడుదలైన రెండు నెలల్లోనే కొత్త సినిమాను ప్రారంభించాలని ప్రయత్నించాడు. కాని అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అన్నట్లుగా చిరంజీవి 152వ చిత్రం అవకాశం రావడం, ఆ చిత్రం చాలా ఆలస్యం అవుతూ ఉండటం జరుగుతుంది. ఎట్టకేలకు నవంబర్‌లో చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు చిరంజీవి అనుమతించాడు. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ పాత్ర కోసం శ్రియ, అనుష్కల పేర్లను పరిశీలించిన దర్శకుడు చివరకు అనుష్కకు ఓటు వేశాడు. మిర్చి సమయంలో అనుష్కతో వర్క్ చేసిన దర్శకుడు కొరటాల శివ మరోసారి ఆమెతో వర్క్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడు. ఇక గతంలో చిరంజీవి సినిమాలో అనుష్క ఒక ప్రత్యేక పాటలో నటించింది. ఇద్దరి కాంబో బాగుందని అప్పట్లో ప్రచారం జరిగింది. అందుకే చిరంజీవికి జోడీగా అనుష్క అయితే సినిమా స్థాయి పెరగడంతో పాటు అన్ని విధాలుగా బాగుంటుందని కొరటాల నిర్ణయించాడు. త్వరలోనే ఈ విషయమై అధికారికంగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.