మెగాస్టార్ చిరంజీవి ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. స్వల్ప కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్న ఆయన.. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉండి వైద్యుల సూచలన మేరకు చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన తల్లి అంజనాదేవి పుట్టిన రోజు వేడుకలకు కూడా దూరమయ్యారు. సోషల్ మీడియా ద్వారానే తల్లికి బర్త్‌డే విషెస్ తెలియజేశారు.
కాగా, క్వారంటైన్‌లో ఖాలీగా ఉండడంతో తనలో దాగిఉన్న మరో కళని బయటకు తీశారు చిరంజీవి. ఫోటోగ్రఫి నైపుణ్యంతో పాటు తన కలానికి పనిచెప్పారు. ఉదయం లేవగానే.. ఆకాశంలో అప్పుడే ఉదయించిన సూర్యుడిని తన కెమెరాలో బంధించి.. ఓ మంచి కవిత్వంతో దానిని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
‘ఈ రోజు ఉదయం లేవగానే కనిపించిన అందమైన ఆకాశాన్ని కెమెరాలో బంధించి మీతో పంచుకోవాలనిపించింది. ఒక మూలగా వున్న నెలవంక, దగ్గర్లో ఉన్నశుక్ర గ్రహం(మధ్యలో చిన్న తార) ఉదయించబోతున్న సూర్యుడు. ఆ కొంటె సూర్యుడ్ని చూడలేక నెలవంక సిగ్గుతో పక్కకు తొలిగినట్లుగా ఉంది’ అంటూ ఆ వీడియోని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక చిరు కవిత్వంపై మెగాస్టార్ ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.