Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఐపీఎల్ వేలంలో ఈ సారి ఎన్నో సంచలనాలు నమోదయ్యాయి. వెస్టెండీస్ విధ్వంసకర బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ తొలిరోజు వేలంలో అమ్ముడుపోకపోవడం అందులో ఒకటి. టీ 20ల స్పెషలిస్ట్ అయిన గేల్ ను సొంతం చేసుకోవడానికి ఫ్రాంఛైజీలు ఎవరూ ఆసక్తి చూపకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఐపీఎల్ లో ఎన్నో ఏళ్లు క్రిస్ గేల్ తన బ్యాటింగ్ తో ప్రేక్షకులను అలరించాడు. పరుగుల వరద పారించి ఎన్నో రికార్డులు సృష్టించాడు. అలాంటి గేల్ ను నిర్దాక్షిణ్యంగా ఫ్రాంఛైజీలు పక్కనపెట్టడం చూస్తే ….ఫామ్ కోల్పోయిన ఆటగాళ్ల విషయంలో జట్టు యజమానులు వ్యవహారశైలి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఒకప్పుడు గేల్ కోసం ఎగబడిన ఫ్రాంఛైజీలు ఈ సారి మాత్రం ఆయన పేరు చెప్పినప్పుడు అంతగా ఆసక్తి ప్రదర్శించలేదు.
రెండో రోజు మొదటి సెషన్ లో అతని పేరు వచ్చినప్పుడూ ఫ్రాంఛైజీలు అనాసక్తిగానే ఉన్నాయి. ఇక ఐపీఎల్ లో గేల్ కథ ముగిసినట్టేనని అంతా అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు సహ యజమాని ప్రీతిజింటా మనసు మార్చుకుంది. అమ్ముడుపోని క్రికెటర్లకు చివర్లో మరోమారు నిర్వహించిన వేలంలో గేల్ కనీస ధర రూ.2కోట్లకు అతడిని కింగ్స్ ఎలెవన్ కొనుగోలు చేసింది. ప్రీతి జింటా ముసిముసిగా నవ్వుతూ లయన్స్ డెస్క్ లోకి గేల్ ను ఆహ్వానించింది.