ప్రముఖ వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్ విషయంలో టెక్ దిగ్గజం గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. 2014 తర్వాత మొదటిసారిగా క్రోమ్ లోగోను స్వల్పంగా మారుస్తోంది. రీడిజైన్‌కు సంబంధించి గూగుల్ క్రోమ్ డిజైనర్ ఎల్విన్ హు తన ట్విటర్ వేదికగా షేర్ చేశారు. ఈ మేరకు “ క్రోమ్ కొత్త ఐకాన్‌ను మీరు ఇవాళ గమనించే ఉంటారు. 8 ఏళ్ల తర్వాత క్రోమ్ బ్రాండ్ ఐకాన్‌ను రిఫ్రెష్ చేస్తున్నాం” అని వెల్లడించారు.
పాత క్రోమ్ లోగో మాదిరి కొత్త బ్రాండ్ ఐకాన్‌లో షాడోలు లేవు. లోగోలో వినియోగించిన నాలుగు రంగులు మునుపటి కంటే చాలా మెరుస్తూ ఉన్నాయి. మధ్యలోని నీలిరంగు వృత్తం కొంచం పెద్దదిగా కనిపిస్తుంది. విండోస్‌తో సహా వివిధ ఆపరేటింగ్ సిస్టమ్‌ల కోసం ఈ లోగోను తయారు చేసినట్లు ఎల్విన్ హు పేర్కొన్నారు. రాబోయే కొద్దిరోజుల్లో డెస్క్‌టాప్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్ల అందరికీ ఈ లోగోలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. కాగా, 2008లో క్రోమ్ బ్రౌజర్‌ను ప్రవేశపెట్టిన తర్వాత తొలుత 2011, 2014 ఏడాదిలో లోగోలో మార్పులు చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే.