శబరిమలలో ధ్వజస్థంభానికి బంగారం…తెలుగోడికి దక్కిన అదృష్టం.
శబరిమలలో కొలువుదీరిన అయ్యప్ప స్వామి భక్తులు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువ. ఇక కొండమీదకి వచ్చే భక్తులకు అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహించడంలోనూ మనదే చురుకైన పాత్ర. నేడు శబరిమలలో ఇంకో అపూర్వ ఘట్టానికి తెర లేవనుంది. దేవాలయం ముందున్న ధ్వజస్థంభానికి బంగారంతో తాపడం చేయనున్నారు. ఈ ఉదయం 11 .40 నుంచి 1 .40 మధ్య ఈ ఉత్సవం జరగనుంది. ఈ బంగారు తాపడానికి ఎంతో మంది దాతలు ముందుకు వచ్చారు. దాదాపు వందమంది ముందుకు వచ్చినా దేవస్థానం బోర్డు అందులో నుంచి ఐదుగురి పేర్లు హై కోర్ట్ పరిశీలనకు పంపింది. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యాపారవేత్త చుక్కపల్లి రమేష్ నేతృత్వంలో నడుస్తున్న ఫీనిక్స్ ఇన్ ఫ్రా కి ఈ అవకాశం దక్కింది.
అయ్యప్పకు ఈ విధంగా సేవ చేసుకునే భాగ్యం కలిగినందుకు ఫీనిక్స్ ఇన్ ఫ్రా సంతోషంతో ఆ కార్యక్రమం చేపట్టింది. కేరళకు చెందిన ప్రముఖ శిల్పి అనంతాచారి నేతృత్వంలో ఈ పనులు సాగాయి. మొత్తం 10 .5 కిలోలు బంగారం ధ్వజస్తంభ తాపడానికి వాడుతున్నారు. 1968 లో ధ్వజస్థంభం ప్రతిష్టించి దానికి పంచలోహాలతో తాపడం చేశారు. 2015 లో బంగారం రంగు అద్దే పని చేస్తున్నప్పుడు ధ్వజస్థంభం పై వున్న అష్టదిక్పాలకుల ప్రతిమలు తొలిగాయి. దీంతో కొత్త ధ్వజస్థంభం ఏర్పాటు తలపెట్టారు. కేరళ హై కోర్ట్ కూడా అదే ఆదేశాలు ఇవ్వడంతో అప్పటినుంచి ఈ పనులకి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు జరుగుతున్న ధ్వజస్తంభ ప్రతిష్టాపనలో ఏ ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఓ తంత్రి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు ఇప్పటికే పెద్ద ఎత్తున శబరిమల చేరుకున్నారు.