పూర్తిగా ప్రైవేటు వ్యక్తులతో తొలిసారిగా చేపట్టిన అంతరిక్ష యాత్ర దిగ్విజయంగా పూర్తయ్యింది. మూడు రోజుల పాటు రోదసిలో గడిపిన నలుగురు యాత్రికులు ఆదివారం క్షేమంగా భూమికి తిరిగొచ్చారు. వీరు ప్రయాణించిన ‘క్రూ డ్రాగన్’ వ్యోమనౌక నిర్దేశిత ప్రదేశంలో సురక్షితంగా దిగింది. ఫ్లోరిడా తీరానికి చేరువలో అట్లాంటిక్ మహాసముద్ర జలాల్లో నౌక క్షేమంగా దిగినట్టు స్పేస్ఎక్స్ సంస్థ వెల్లడించింది. పూర్తిస్థాయి వ్యోమగాముల సహకారం లేకుండానే పర్యాటకులు భూ కక్ష్యలో పరిభ్రమించి రావడం ఇదే మొదటిసారి.
స్పేస్ఎక్స్ సంస్థకు చెందిన ‘క్రూ డ్రాగన్’ వ్యోమనౌకలో ఈ యాత్రికులు గత బుధవారం రాత్రి అమెరికాలోని కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి పయనమైన సంగతి తెలిసిందే. ప్రపంచ కుబేరుడు జేర్డ్ ఇసాక్‌మన్ నేతృత్వంలో హేలీ ఆర్సినో, క్రిస్ సెంబ్రోస్కీ, సియాన్ ప్రాక్టర్లు వీరిలో పాల్గొన్నారు. ఈ యాత్రకు అయిన ఖర్చు మొత్తాన్నీ ఇజాక్‌మన్ భరించారు. వ్యోమనౌక ఆర్బిట్ నుంచి భూకక్ష్యలోకి చేరే క్రమంలో దాని వెలుపల ఉన్న ఉష్ణోగ్రతలు 3,500 డిగ్రీల ఫారెన్‌హీట్‌కి చేరుకుంది. అయితే, క్యాబిన్ వేడిక్కితే వ్యోమగాముల ఫ్లైట్ సూట్లు చల్లగా ఉండేలా ప్రత్యేక వ్యవస్థలను రూపొందించారు.
సముద్ర జలాలను తాకడానికి ముందు క్రూ డ్రాగన్‌లోని నాలుగు పారాచూట్లు విచ్చుకుని, వేగాన్ని తగ్గించాయి. మెల్లగా వ్యోమనౌక సముద్రంలో దిగింది. దాదాపు గంట అనంతరం వ్యోమనౌకను సముద్రం నుంచి వెలికితీశాయి. ‘క్రూ డ్రాగన్’ తెరుచుకున్నాక.. చిరునవ్వులు చిందిస్తూ ఆర్సినో తొలుత బయటకు వచ్చారు. ఒకరి తర్వాత ఒకరు బయటకు వచ్చి విజయదరహసం చిందించారు. ‘‘అంతరిక్షం మనందరికీ చెందుతుందని మీ యాత్ర రుజువు చేసింది’’ అని స్పేస్ఎక్స్ మిషన్ కంట్రోల్ అధికారి వ్యాఖ్యానించగా… ‘‘ఇదో అద్భుత యాత్ర. ఇది ఆరంభం మాత్రమే’’ అని ఇసాక్‌మన్ బదులిచ్చారు.
ఇది తన జీవితంలోనే అత్యుత్తమ ప్రయాణమని ప్రాక్టర్ ట్వీట్ చేశారు. జేర్డ్ ఇసాక్‌మన్ ఈ ప్రయోగానికి కమాండర్‌గా వ్యవహరించారు. భూ ఉపరితలం నుంచి 575 కిలోమీటర్ల ఎత్తున సర్కులర్ ఆర్బిట్‌లోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం , హబుల్ స్పేస్ టెలిస్కోప్ పరిధి దాటి మరింత ఎత్తున మూడు రోజులు పాటు గడిపారు.1969లో ‘అపోలో-9’ యాత్ర తర్వాత ఒక వ్యోమనౌక అట్లాంటిక్ మహాసముద్రంలో దిగడం ఇదే మొదటిసారి కాగా.. ఓ నల్లజాతీయ మహిళను ఈ స్పేస్ క్రాఫ్ట్ పైలెట్‌గా నియమించడం ఇదే తొలిసారి.