ఏపీ మూడు రాజధానుల అంశంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది. ముందు నుంచి రాజధానిపై జోక్యం చేసుకోలేమని చెబుతున్న కేంద్రం మళ్ళీ అదే తంతు వినిపించింది. రాజధానిని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుందని, ఈ విషయంలో తమ పాత్ర లేదని మరోసారి హైకోర్టుకు నివేదించింది.
అంతేకాదు సీఆర్‌డీఏ రద్దు చట్టం చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని సంప్రదించలేదని తేల్చి చెప్పింది. ఈ వ్యవహారం పూర్తిగా రాష్ట్రప్రభుత్వానికి చెందినదని, అందులో కేంద్రం భాగం కాలేదని పేర్కొంది. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సీఆర్‌డీఏ రద్దు చట్టం, పాలనా వికేంద్రీకరణ బిల్లులను సవాల్ చేస్తూ గుంటూరు జిల్లా యర్రబాలెం గ్రామానికి చెందిన డి.సాంబశివరావు, ఐనవోలుకు చెందిన టి.శ్రీనివాసరావు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర హోం శాఖ మరోసారి ఈ అంశంపై క్లారిటీ ఇచ్చింది.