గాజాలో హమాస్ మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ తీవ్రంగా విరుచుకుపడుతోంది. ఖైదీల విడుదల విషయంలో తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఇజ్రాయెల్‌కు చెందిన బందీలు సజీవంగా గాజా నుంచి బయటపడలేరని హమాస్ బెదిరింపులకు పాల్పడినా పట్టించుకోకుండా సోమవారం బాంబుల వర్షం కురిపించింది. మరోవైపు ఉత్తర గాజాలోని రెండు నగరాల్లో ప్రజల మధ్యే ఇజ్రాయెల్ సైన్యం , హమాస్ మిలిటెంట్ల భూతల పోరు సాగుతోంది. ‘మా ఖైదీల విడుదల, చర్చలు జరపకుండా ఇజ్రాయెల్ బందీలు సజీవంగా స్వదేశానికి వెళ్లలేరు’ అని ఆదివారం హమాస్ బెదిరించింది. గాజాలో హమాస్ చెరలో 137 మంది బందీలుండగా.. 7 వేల మంది పాలస్తీనీయులు ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్నారు. ఈ హెచ్చరికలను ఇజ్రాయెల్ ఏ మాత్రం పట్టించుకోలేదు. దాడులను కొనసాగించింది. దక్షిణ గాజా నగరమైన ఖాన్ యూనిస్‌లో తీవ్ర పోరాటం సాగుతోందని స్థానికులు తెలిపారు. గాజా సిటీలోనూ సైన్యానికి, మిలిటెంట్లకు మధ్య పోరు జరుగుతోంది. జబాలియా శరణార్థి శిబిరం చుట్టూ కాల్పుల మోత మోగుతోంది.