‘పెళ్లి చూపులు’ దుకాణం సర్దేశారు!

pradeep pelli choopulu program

ప్రముఖ టీవీ ఛానెల్‌లో ప్రసారం అవుతున్న ‘పెళ్లి చూపులు’ కార్యక్రమానికి ప్రేక్షకుల నుండి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెల్సిందే. ఈ షో ప్రారంభమైన మొదటి రోజు నుండే వ్యతిరేకత వస్తోంది. దాంతో షో యాజమాన్యం ఇక దుకాణం సర్దేయడానికి రెడీ అయినట్టు తెలుస్తోంది. ప్రముఖ యాంకర్లతో ఈ షోను సూపర్‌హిట్‌ చేయాలనుకున్న యాజమాన్యానికి చుక్కదురు అయ్యింది. ఫిమేల్‌ యాంకర్‌గా గతకొంత కాలంగా మొదటి ప్లేస్‌లో ఉన్న యాంకర్‌ సుమపై కూడా ఎన్నడు లేని విధంగా విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా పలు సూపర్‌హిట్‌ షోలకు నిర్వహించిన సుమకు ఈ చెత్త కార్యక్రమం ఎలా చేయాలనిపించింది అంటూ సుమ అభిమానులు మండి పడుతున్నారు. దాంతో సుమ కూడా ఈ షోకు బై చెప్పాలనుకుందట. ఇక చేసేది లేక ఈ షోను ముగించాలని యూనిట్‌ భావిస్తోంది.

pradeep ancoer

మేల్‌ యాంకర్‌గా, డీసెంట్‌ యాంకర్‌గా మంచి పేరు తెచ్చుకున్న ప్రముఖ యాంకర్‌ ప్రదీప్‌ ఈ షో ద్వారా చాలా విమర్శల పాలయ్యాడు. ‘పెళ్లి చూపులు’ కార్యక్రమంలో ప్రదీప్‌ది కీలక పాత్ర. ఈయన కోసం ఈ షోను నిర్వహిస్తున్నట్టు మొదటి నుండి పబ్లిసిటి చేశారు. దాంతో ప్రదీప్‌ పెళ్లి చూపుల కోసం ప్రత్యేక కార్యక్రమం ఏంటి అని మొదటి నుండే విమర్శలు మొదలయ్యాయి. ప్రదీప్‌ను ఓ మన్మధుడిలా చూపించడం, ఇంకా ఈ షోకు వచ్చిన అమ్మాయిలు ప్రదీప్‌ను అదోలా చూడడం, స్కిట్‌లంటూ అమ్మాయిల పార్ట్‌ను ప్రదీప్‌ గుర్తు పట్టేలా వాటిని జూమ్‌ చేయడం అంతా ‘పెళ్లి ఛీఫ్‌లు’గా మారిపోయిందని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. అయితే అన్ని విషయాల్లో కూడా ‘పెళ్లి చూపులు’ ఘోరంగా పరాజయం పాలయ్యింది. తీవ్ర స్థాయిలో విమర్శలు, అనుకున్న రేటింగ్స్‌ కూడా రాకపోవడంతో ఈ షోకు పుల్‌స్టాప్‌ పెట్టాలని యూనిట్‌ సభ్యులు భావిస్తున్నట్టు సమాచారం.