దాదాపు ఏడాది విరామం తర్వాత ప్రధాని మోడీని కలవబోతున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. మోడీతో బాబు భేటీకి అపాయింట్ మెంట్ ఖరారయింది. ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి సమావేశం కానున్నారు. ప్రధాని కార్యాలయం కూడా దీన్ని ధృవీకరించింది. విభజన చట్టంలోని అంశాలతో పాటు పలు విషయాలపై వారిద్దరూ చర్చించనున్నారు. పోలవరం ప్రాజెక్టు, అసెంబ్లీ సీట్ల పెంపు అంశాలపై ప్రధానంగా చర్చ జరగనుంది. కాపు రిజర్వేషన్ల అంశాన్ని కూడా చంద్రబాబు ప్రస్తావించే అవకాశం కనిపిస్తోంది. ఏడాదికాలంగా చంద్రబాబుకు మోడీ అపాయింట్ మెంట్ దొరకలేదు. చంద్రబాబు ప్రధానితో సమావేశమయ్యేందుకు ప్రయత్నించినా… పీఎంవో నుంచి రిప్లై రాలేదు. మారిన రాజకీయ పరిస్థితుల్లోనే చంద్రబాబుతో భేటీ అయ్యేందుకు మోడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఎన్నికలకు ఏడాది సమయమే ఉండడంతో పాటు ఏపీలో టీడీపీనే మళ్లీ గెలిచే అవకాశమున్నట్టు వెలువడున్న విశ్లేషణలు మోడీ వైఖరిలో మార్పుకు కారణంగా భావిస్తున్నారు. వైసీపీతో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీచేయాలని తొలుత అనుకున్న బీజేపీ తర్వాత ఆ ఆలోచన విరమించుకుంది. 2019లోనూ పాతమిత్రపక్షంతో కలిసి ఎన్నికలకు వెళ్లాలన్నది బీజేపీ తాజా వ్యూహం. బాబుకు అపాయింట్ మెంట్ ఇవ్వడం ద్వారా మోడీ ఏపీ ప్రజలకు తమ పయనం టీడీపీతోనే అన్న సంకేతాలు పంపారు. ఏపీలో జన్మభూమి కార్యక్రమం ముగిసిన మర్నాడు మోడీని కలవనున్నారు చంద్రబాబు. సీఎం అనుకూలత మేరకే పీఎంవో అధికారులు అపాయింట్ మెంట్ 12వ తేదీన ఫిక్స్ చేశారు.