ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించి పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నా, కొన్ని చోట్ల అధికారుల పనితీరు కారణంగా ప్రజల్లో అపప్రథ కలుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పెన్షన్ పంపిణీలో అవినీతి, జాప్యం, అధికారుల నిర్లక్ష్యం ప్రజలకు ఇబ్బందిగా మారిందని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుకు అధికారులు తమ విధి నిర్వహణలో మార్పు తేవాలని సీఎం స్పష్టం చేశారు.
ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో అధికారులు మరింత వేగంగా పని చేయాలని, ప్రజల సమస్యలను శ్రద్ధగా విని, సేవాభావంతో విధులు నిర్వర్తించాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో టెక్నాలజీని సమర్థంగా వినియోగించుకోవాలని, ప్రజలకు సేవలు మరింత సులభతరం చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
వాట్సాప్ గవర్నెన్స్‌పై సమీక్ష – సరికొత్త సేవలు
వాట్సాప్ గవర్నెన్స్ ప్రోగ్రామ్ పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మొదటి వారం లోపే 2.64 లక్షల లావాదేవీలు జరిగినట్లు వెల్లడించారు. త్వరలో టీటీడీ సేవలు, రైల్వే సేవలను కూడా వాట్సాప్ గవర్నెన్స్‌లో అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. ఈ సేవలు యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలా అభివృద్ధి చేయాలని అధికారులకు ఆదేశించారు.
ప్రజలు సర్కారీ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, అన్ని సేవలను డిజిటల్ విధానంలో అందుబాటులోకి తేవాలన్నారు. కొన్ని శాఖలు సర్వర్ సామర్థ్యాన్ని పెంచుకోవాలని, ఫైళ్లను త్వరితగతిన క్లియర్ చేయాలని సూచించారు.
శివరాత్రి ఏర్పాట్లపై స్పష్టమైన ఆదేశాలు
శివరాత్రి సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, శ్రీశైలం సహా రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో సమర్థవంతమైన ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని యాత్రికులకు సరైన సౌకర్యాలు, భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.