Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నంద్యాల,కాకినాడ ఎన్నికలు ఇచ్చిన ఊపుతో టీడీపీ అధినేత చంద్రబాబు 2019 ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నారు. అందుకోసం ప్రత్యేక వ్యూహం రచిస్తున్నారు. ఈసారి ఆయన కుర్రకారుని నమ్ముకుని ఎన్నికలకు వెళ్ళబోతున్నారు. 1983 లో పార్టీ ఆవిర్భావం జరిగినప్పుడు చాలా మంది కుర్రోళ్ళు, విద్యావంతులు టీడీపీ జెండా పట్టుకున్నారు. వాళ్ళే కాంగ్రెస్ కంచుకోటల్ని కూలదోసి దిగ్గజ నాయకులుగా ఎదిగారు. పార్టీ పుట్టి 35 ఏళ్ళు గడిచాక వెనక్కి తిరిగి చూసుకుంటే నాటి నాయకులే ఇంకా టీడీపీ లో పెత్తనం సాగిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ఇంకా జనాభిమానం వున్న సీనియర్ నాయకులతో పాటు కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్న వారిని ప్రోత్సహించాలని బాబు లాంఛనంగా ఓ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. ఇదంతా కొడుకు లోకేష్ కి సరిపోయే టీం తయారు చేయడానికే అన్న వాదనలు వినిపిస్తున్నప్పటికీ ఆయన వెనుకంజ వేసే ప్రసక్తే లేదట.
2019 ఎన్నికల నాటికి మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను దాదాపు 80 చోట్ల కొత్త అభ్యర్థులు టీడీపీ తరపున ఎన్నికల బరిలోకి దిగే అవకాశం ఉందట. ఒక్కసారిగా ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేక సీనియర్స్ ఎన్నికల టైం లో యాగీ చేసే అవకాశం ఉందని ఆలోచించిన బాబు ఇప్పటికే వారితో విషయం చెప్పారట. మీ వారసుల్ని ఎన్నికలకు సన్నద్ధం చేసుకోవాలని కూడా సూచించారట. పిల్లల రాజకీయ భవిష్యత్ కి భరోసా ఉండటంతో ఆ నాయకులు కూడా పెద్దగా అభ్యంతరాలు ఏమీ చెప్పలేదట. అయితే అధికారంలో వుంటూ ఇంత పెద్ద ఎత్తున కుర్రకారుని ఎన్నికల బరిలోకి దింపడం టీడీపీ కి కూడా ఇదే తొలిసారి. అందుకే ఈ ప్రక్రియలో వచ్చే సమస్యల్ని అంచనా వేయడానికి ఇప్పటికే ఓ మేధావుల కమిటీ పని చేస్తోందట. ఆ కమిటీ సూచనలు, సలహాల మేరకు టీడీపీ 2019 లో కుర్రకారుకి సైకిల్ బాధ్యతలు అప్పగించబోతోంది.