దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో మరో ప్రతిష్టాత్మక పథకానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు జెడ్పీ పాఠశాలలో ‘జగనన్న విద్యాకానుక’ పథకాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. తొలుత పునాదిపాడు జిల్లా పరిషత్ హైస్కూల్‌లో నాడు-నేడు పనులను పరిశీలించిన సీఎం.. విద్యార్థులను ప్రేమగా, ఆప్యాయంగా పలకరించి కాసేపు వారితో మాట్లాడారు. తరగతి గదుల్లో బల్లలపై కూర్చుని విద్యార్థుల అభిప్రాయాలను సీఎం జగన్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకటవ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థిని, విద్యార్థులకు ప్రత్యేక స్కూల్ కిట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు.
పాఠశాలల్లో పిల్లల నమోదును గణనీయంగా పెంచడంతో పాటు, మెరుగైన ఫలితాలు సాధించడమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 42,34,322 మంది విద్యార్థులకు వారి విద్యాభ్యాసానికి అవసరమైన ఏడు రకాల వస్తువులను ఈ కిట్ల రూపంలో అందించనున్నారు. పిల్లలను బడిలో చేర్చే సమయంలో ఇబ్బంది పడే పేదింటి అక్కచెల్లెమ్మలకు విముక్తి కలిగించడంతో పాటు, పాఠశాలల్లో “డ్రాప్ అవుట్‌లను గణనీయంగా తగ్గిస్తూ, బాలల బంగారు భవిష్యత్తుకుక బాటలు వేయడమే లక్ష్యంగా “జగనన్న విద్యా కానుక’ను ప్రభుత్వం అమలు చేస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా 42,34,322 మంది విద్యార్థిని, విద్యార్థులకు దాదాపు రూ.650 కోట్ల ఖర్చుతో స్కూల్ కిట్లు పంపిణీ చేస్తున్నారు. స్కూళ్లు తెరిచే నాటికి పిల్లలు యూనిఫామ్‌లు కుట్టించుకునే విధంగా వారికి ముందుగానే ఈ కిట్లు అందజేస్తున్నారు. ప్రతి విద్యార్థికి స్కూల్ కిట్‌తో పాటు మూడు మాస్కులు అందించనున్నారు. 3.13 కోట్లకు పైగా పాఠ్య పుస్తకాలు, 2.19 కోట్లకు పైగా నోట్ పుస్తకాలు, 1.27 కోట్ల యూనిఫారాలు (క్లాత్), బూట్లు, సాక్సులు, బెల్టు, బాల బాలికలకు వేర్వేరు రంగుల బ్యాగులు ఆయా తరగతులకు తగ్గట్టుగా అందించనున్నారు. యూనిఫామ్ కుట్టు కూలీ మూడు జతలకి రూ.120 చొప్పున తల్లుల అకౌంట్‌కే నేరుగా జమ చేస్తారు. స్కూల్ కిట్‌కు సంబంధించిన వస్తువుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడలేదు. అత్యంత పారదర్శకంగా రివర్స్ టెండరింగ్, ఈ–ప్రొక్యూర్‌మెంట్ విధానంలో సేకరించారు.