ఆర్టీసీ సమ్మెకు ఇంకా పరిష్కారం లేదా?

ఆర్టీసీ సమ్మెకు ఇంకా పరిష్కారం లేదా?

దాదాపు 43రోజులు తెలంగాణలో సకల జనుల సమ్మె కంటే కూడా ఎక్కువ కాలం సమ్మె ఆర్టీసీ సమ్మె పరిష్కారమయ్యే సూచలను అయితే కనిపించడం లేదు. కార్మికులు ‘ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం’ ప్రతిపాదనపై వెనక్కి తగ్గినా కేసీఆర్ మాత్రం సమ్మె పరిష్కారం విషయంలో వెనక్కి తగ్గడం లేదు. మొండిపట్టుదలతో ముందుకెళుతున్నారు. దీంతో సమ్మె ఎటువైపు దారితీస్తుందోనన్న ఆందోళన కార్మిక సంఘాలను వెంటాడుతోంది.

అయితే కేసీఆర్ మాత్రం ఆర్టీసీ అంతు చూసే పనిలో సీరియస్ గా నిమగ్నమైనట్టు ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగానే ఆర్టీసీపై బిగ్ బాంబ్ వేసేందుకు రెడీ అయ్యారని సమాచారం. అదే వీఆర్ఎస్. ఈ స్వచ్ఛంద పదవీ విరమణను ఆర్టీసీలో అమలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.. ఆర్టీసీలో 50ఏళ్లకు పైబడిన వారు.. ఉద్యోగంపై ఆసక్తి లేని వారికి వీఆర్ఎస్ ఇచ్చి సెటిల్ చేసే సాగనంపేయాలని.. ప్రైవేటీకరణకు బాటలు వేయాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

తెలంగాణ ఆర్టీసీలో ప్రస్తుతం 49733 మంది కార్మికులున్నారు. వీరిలో 50 ఏళ్లకు పైబడిన వారు దాదాపు 7వేల మందికి పైగా ఉన్నారు. అయితే ఇప్పటికే సగం 5100 బస్సులను ప్రైవేటుకిచ్చిన కేసీఆర్ దాదాపు 30శాతం వరకూ ప్రైవేటీకరణ తప్పదని స్పష్టంచేశారు. ఈ లెక్కన దాదాపు 27వేల మందికి వీఆర్ఎస్ ఇచ్చి సాగనంపాలని కేసీఆర్ సర్కారు ప్లాన్ చేస్తోందట.

అయితే కేసీఆర్ ప్లాన్లు ఇప్పట్లో వర్కవుట్ కావు. సమ్మె కొనసాగుతుండడం హైకోర్టులో విచారణ ఉండడంతో ఇప్పుడు వీఆర్ఎస్ ప్రతిపాదనను అమలు చేయడానికి ఆస్కారం లేదు. సమ్మె ముగిశాక కేసీఆర్ ఈ ప్రతిపాదన తెరపైకి తీసుకొస్తాడట.. ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆర్టీసీ కార్మికులకు షాకిచ్చేలా కేసీఆర్ తీసుకొస్తున్న ఈ వీఆర్ఎస్ ఎఫెక్ట్ ఆర్టీసీని ఏం చేస్తుందనేది ఆసక్తిగా మారింది.