‘దళిత బంధు’ పథకంపై కేసీఆర్ కీలక నిర్ణయం

‘దళిత బంధు’ పథకంపై కేసీఆర్ కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘దళిత బంధు’ పథకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. హుజురాబాద్‌లో పైలట్ ప్రాజెక్టు కింద ఇప్పటికే దళిత బంధు అమలు చేసిన ప్రభుత్వం రూ.2వేల కోట్ల నిధులు కేటాయించిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రంలోని తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లోని.. దళిత ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న నాలుగు నియోజకవర్గాల్లోని 4 మండలాల్లో దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు.

ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం, నాగర్‌ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని చారగొండ మండలం, కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాం సాగర్ మండలాలను దళిత బంధు పథకం అమలు కోసం ఎంపిక చేశారు. ఈ నాలుగు మండల్లాలోని అర్హత కలిగిన దళిత కుటుంబాలకు వెంటనే దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం వర్తింప చేయాలని నిర్ణయించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఆయా జిల్లాల మంత్రులు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లతో దళిత బంధు అమలుపై హైదరాబాద్‌లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఆ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకుని ఎంపిక చేసిన నాలుగు మండలాల్లో దళితబంధు పథకాన్ని అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వనున్నట్లు సమాచారం.