సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్

సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్

వేలకు వేలు పోసి ప్రైవేటు పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం చదువులు చదివించలేకపోతున్న తల్లిదండ్రులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఇప్పటికే మన ఊరు – మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను తీర్చిదిద్దే కార్యక్రమం చేపట్టారు. ఈరోజు వనపర్తి జిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్.. పట్టణంలోని జడ్పీ హైస్కూల్2లో మన ఊరు మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మన ఊరు మన బడి కార్యక్రమం వనపర్తిలో ప్రారంభించుకోవడం జిల్లాకు దక్కిన గౌరవమన్నారు.

తామంతా ప్రభుత్వ పాఠశాల్లో చదువుకున్న వాళ్లమేనని సీఎం కేసీఆర్ అన్నారు. అక్కడ చదువుకునే ఉన్నత స్థానాలకు వచ్చామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చక్కటి వసతులు కల్పించనున్నామని.. విద్యార్థులంతా శ్రద్ధగా చదువుకోవాలని సీఎం ఆకాంక్షించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఇంగ్లిష్ మీడియం బోధనను ప్రారంభించనున్నట్లు కేసీఆర్ తెలిపారు. బాగా చదువుకుని భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని ఆయన అభిలషించారు.

వనపర్తి పర్యటనకు విచ్చేసిన సీఎం కేసీఆర్.. తొలుత చిట్యాలలో నిర్మించిన నూతన మార్కెట్ యార్డును ప్రారంభించారు. వనపర్తిలో నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించిన ఆయన సాయంత్రం మెడికల్ కాలేజీ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం ఆయన అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడతారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సబిత ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు వనపర్తిలో సీఎంకి ఘన స్వాగతం పలికారు.