రైతుల సంతోష‌మే ల‌క్ష్యంః రాష్ట్రావ‌తర‌ణ వేడుక‌ల్లో ముఖ్య‌మంత్రి

cm kcr speech at parade ground
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలంగాణ అంత‌టా రాష్ట్రావ‌త‌ర‌ణ వేడుక‌లు ఘ‌నంగా జరిగాయి. సికింద్రాబ‌ద్ పెరేడ్ గ్రౌండ్స్ లో జ‌రిగిన వేడుక‌ల్లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. సాయ‌ధ బ‌ల‌గాల గౌర‌వ వంద‌నం స్వీక‌రించిన అనంత‌రం ప్ర‌జ‌లనుద్దేశించి ప్ర‌సంగించారు. నాలుగేళ్ల‌లో తెలంగాణ ప్ర‌భుత్వం సాధించిన విజ‌యాలు, భ‌విష్య‌త్ ల‌క్ష్యాల‌ను వివ‌రించారు. తెలంగాణ ఏర్ప‌డితేనే రాత మారుతుంద‌ని పోరాడి స్వ‌రాష్ట్రం సాధించుకున్నామ‌ని, రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమ‌రుల‌కు నివాళి అర్పిస్తున్నాన‌ని కేసీఆర్ చెప్పారు. ప్ర‌జ‌ల్లో మాన‌సిక స్థైర్యాన్ని పెంచుతూనే సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లుచేస్తున్నామ‌న్నారు. రైతులంద‌రికీ రూ.5ల‌క్ష‌ల జీవిత‌భీమా అమ‌లుచేస్తున్నామ‌ని తెలిపారు. రైతు ప్ర‌మాద‌వ‌శాత్తూ చ‌నిపోతే ఆ కుటుంబం చిన్నాభిన్న‌మ‌వుతోంద‌ని, ఈ ప‌రిస్థితి రాకూడ‌ద‌నే రైతు భీమా ప‌థకాన్ని తీసుకొచ్చామ‌ని, రైతుల నుంచి రూపాయి తీసుకోకుండా రూ.5ల‌క్ష‌ల బీమా స‌దుపాయం క‌ల్పిస్తున్నామ‌ని తెలిపారు.
రైతు సంక్షేమం కోసం తెలంగాణ ప్ర‌భుత్వం ఎన్నో కార్య‌క్రమాల‌ను అమలు చేస్తోంద‌న్నారు. ఇప్ప‌టికే రైతుల‌కు రుణ‌మాఫీ చేశామ‌ని, వ్య‌వ‌సాయ ప‌రిక‌రాల‌కు రాయితీ ఇచ్చామ‌ని, నీటితీరువా, ట్రాక్ట‌ర్ల‌పై వాహ‌నం ప‌న్ను ర‌ద్దుచేశామ‌ని చెప్పారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు తెలంగాణ‌కు జీవ‌దాయిని కానుంద‌ని, దేశంలో ఎక్క‌డా లేని విధంగా వేగంగా, ఆధునిక ప‌రిజ్ఞానంతో కాళేశ్వ‌రం నిర్మిస్తున్నామ‌ని, కేంద్ర జ‌ల‌సంఘం స‌భ్యులు కూడా కాళేశ్వ‌రం నిర్మాణాన్ని మెచ్చుకున్నార‌ని తెలిపారు. తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభించిన రైతు బంధు గురించి వివ‌రించారు. రైతు బంధు ప‌థ‌కంతో రైతుల ముఖాల్లో ఆనందం చూస్తున్నామ‌ని, ఎక‌రాకు రూ. 8వేల పెట్టుబ‌డి సాయం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేసీఆర్ చెప్పారు. కొంద‌రు ధ‌నిక రైతులు రైతుబంధు చెక్కులు వ‌దులుకుని స్ఫూర్తిగా నిలిచార‌ని, మ‌రికొంద‌రు రైతులు రైతుబంధుకు విరాళాలిచ్చి త‌మ మంచి మ‌న‌సు చాటుకున్నార‌ని ముఖ్య‌మంత్రి కొనియాడారు. రైతుల కోసం మ‌రెంతో చేయాల‌న్న త‌ప‌న త‌న‌లో పెరిగింద‌ని, రైతుల‌ను అప్పుల ఊబినుంచి బ‌య‌ట‌ప‌డేయాల‌న్న‌దే త‌న ల‌క్ష్య‌మ‌ని  కేసీఆర్ చెప్పారు.
ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల ప‌నితీరుపై త‌న ప్ర‌సంగంలో ప్ర‌శంస‌లు కురిపించారు కేసీఆర్.  ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల ప‌ట్ల ప్ర‌జ‌ల్లో అపోహ‌లు తొల‌గి విశ్వాసం పెరిగింద‌ని, గ‌వ‌ర్న‌ర్ స్వ‌యంగా గాంధీలో చికిత్స చేయించుకోవ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని అన్నారు. ఐసీయూ, డ‌యాల‌సిస్ కేంద్రాలు ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో ఏర్పాటుచేస్తున్నామ‌ని తెలిపారు. రాష్ట్రంలో అనేక‌మంది కంటి సంబంధిత స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నార‌ని, త్వ‌ర‌లోనే రాష్ట్ర వ్యాప్తంగా కంటి వైద్య‌ప‌రీక్ష‌లు, శ‌స్త్ర చికిత్స శిబిరాలు నిర్వ‌హిస్తామ‌ని కేసీఆర్ తెలిపారు.