సీఎం రమేష్ మొక్కు తీరింది !

CM Ramesh Visits Tirumala

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ మొక్కు తీర్చుకున్నారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటయ్యే వరకూ తాను జుట్టు సహా గడ్డం కత్తిరించుకోనని ఒక్కసారే కడప స్టీల్ కి శంఖుస్థాపన అయ్యాకే శ్రీవారి సమక్షంలో వాటిని సమర్పిస్తానని రమేష్ మొక్కుకున్నారు. అయితే విభజన హామీల్లో పేర్కొన్న కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటును కేంద్ర కావాలని కాలయాపన చేయడంతో రాష్ట్ర ప్రభుత్వమే దానిని నెలకొల్పాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా కొద్దిరోజుల కిందట చంద్రబాబు శంకుస్థాపన చేశారు. సుమారు రూ.18వేల కోట్ల వ్యయంతో 3వేల ఎకరాల్లో ఈ పరిశ్రమ ఏర్పాటు కానుంది. తన కోరిక నెరవేరుతుండటంతో సీఎం రమేష్ తన మొక్కు తీర్చుకునేందుకు ఆదివారం రాత్రి కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారి మెట్టు మార్గంలో తిరుమల కొండపైకి చేరుకున్నారు. ఈరోజు ఉదయం స్వామివారికి తలనీలాలు సమర్పించి కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు.